భ‌ద్ర‌త పేరుతో రాజ‌కీయం చేస్తున్నార‌న్న హోంమంత్రి..!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త పేరుతో రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు ఏపీ హోం మంత్రి సుచ‌రిత‌. ఆయ‌న ఇంకా ముఖ్య‌మంత్రి అనే భావ‌న‌లోనే ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను తొల‌గించార‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నార‌నీ, కానీ త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని ఆయ‌న‌ ఎక్క‌డా ప్ర‌భుత్వాన్ని కోర‌లేద‌ని ఆమె చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు వేరేగా ఉంటాయ‌నీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో ఉన్న‌ప్పుడు మ‌రోలా ఉంటాయ‌నేది ఆయ‌న గుర్తించాల‌న్నారు. అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబుకి ఇవి తెలియ‌వా అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికీ తానే సీఎం అని వ్య‌వ‌హ‌రించ‌డం చంద్ర‌బాబు మానుకుంటేనే వాస్త‌వాలు అర్థ‌మౌతాయ‌న్నారు.

ప్రధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తార‌నీ, దాని ప్ర‌కార‌మే చంద్ర‌బాబుకి భ‌ద్ర‌త ఉంద‌న్నారు. ఆ ప్ర‌కారం 58 మంది సిబ్బందిని భ‌ద్ర‌త‌కు నియ‌మించాల్సి ఉంటుంద‌నీ, కానీ త‌మ ప్ర‌భుత్వం చంద్ర‌బాబు నాయుడుకి 74 మందిని కేటాయించామ‌న్నారు. కాబ‌ట్టి, నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇవ్వాల్సిన సిబ్బంది కంటే ఎక్కువ‌మందినే ఆయ‌న భ‌ద్ర‌త‌కు ఇచ్చామ‌న్నారు సుచ‌రిత‌. ప్ర‌తిపక్ష నాయ‌కుడికి చెందిన ప్రైవేటు ఆస్తుల‌కు ఎక్క‌డా భ‌ద్ర‌త ఇవ్వ‌డం అనేది ఉండ‌ద‌న్నారు. ప్ర‌తీదానికీ రాజ‌కీయ రంగు పుల‌మ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన అంశంగా మారిపోయింద‌న్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పార‌నీ, గొడ‌వ‌ల‌కు ఆస్కారం లేకుండా చేయాల‌న్నార‌నీ, కాబ‌ట్టి నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే అన్నీ జ‌రుగుతున్నాయ‌నీ, ప్ర‌తిప‌క్ష నేత భ‌ద్ర‌త‌పై కూడా ఎక్క‌డా ఎలాంటి లోటు చేయ‌డం లేద‌న్నారు.

రాష్ట్ర హోంమంత్రి స్పంద‌న ఇలా ఉంటే… మ‌రోప‌క్క తెలుగుదేశం మాత్రం, చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌ను త‌గ్గించేశారంటూ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇదే అంశమై హైకోర్టుకు కూడా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు భ‌ద్ర‌త త‌గ్గించార‌ని చంద్ర‌బాబు అంటుంటే, ఉన్న‌వారి కంటే ఎక్కువ‌గా ఉన్నార‌ని ప్ర‌భుత్వం అంటోంది. త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కోరలేద‌ని హోం మంత్రి అంటున్నారు. ప్ర‌భుత్వం వైపు నుంచి భ‌ద్ర‌తా సిబ్బంది లెక్క‌లు ప‌క్కానే చెబుతున్నారు. ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించాల‌ని చంద్ర‌బాబు నాయుడు కోరుతున్నారు. త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న నేరుగా కోరలేద‌న్న‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com