మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయాలను హైకమాండ్‌కు వివరించేందుకు రేవంత్ రెడ్డి బృందం సిద్ధమైంది. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చామని నివేదించేందుకు ముఖ్యనేతలంతా ఢిల్లీ వెళ్లున్నారు. గురువారం హైకమాండ్ పెద్దలతో సమావేశం కనున్నారు. గెలుపు గుర్రం ఎక్కిన ఉత్సాహంలోనే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ , నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు.
సస్పెన్స్‌గా మారిన కేబినెట్ విస్తరణ
తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనలో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు, ఆ వెంటనే రానున్న పరిషత్ ఎన్నికలు. ఇలాంటి కీలక సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే, పదవులు దక్కని వారి నుంచి అసమ్మతి వ్యక్తమై ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన హైకమాండ్‌లో వ్యక్తమవుతోంది.
రేవంత్ రెడ్డి మాటే ఫైనల్
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం.. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాటే వేదంగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల విజయంతో ఆయన గ్రాఫ్ హైకమాండ్ వద్ద అమాంతం పెరిగింది. రేవంత్ రెడ్డి స్వయంగా మార్పులు కోరుకుంటే తప్ప, మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు అనుకూలమైన వారు మరియు పనితీరు బాగున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తుండగా, సామాజిక సమీకరణాలను బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టీమ్‌ను మార్చుకోవడానికి సిద్ధంగా లేని రేవంత్
టీమ్‌ను మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గంలో కొంత మంది తీరుపై అసంతృప్తిగా ఉన్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఇప్పుడుకొంత మందిని తప్పిస్తే అంతకు రెట్టింపు మంది పదవుల కోసం వస్తారు. ఇప్పుడు ఆ మంత్రుల్ని కంట్రోల్ లో ఉంచుకుని సైలెంట్ చేస్తే.. పాలన లాగించేయవచ్చని అనుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. అందుకే కేబినెట్లో ఖాళీగా ఉన్న సీట్లను ఆశావహుల కోసం అలాగే ఉంచి.. రాజకీయం నడిపించే అవకాశం ఉంది.
