చైనా మాల్. అంటే యమ చీప్. నాణ్యత గురించి అడగొద్దు. వారంటీ గ్యారంటీ ఉండదు. ప్రతి వస్తువుకూ నకిలీలు తయారు చేసి ప్రపంచం మీదికి వదులుతుంది. ఇప్పుడు కృత్రిమ కోడిగుడ్లను భారత్ లో డంప్ చేస్తోందట. అందులోనూ, కేరళలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి.
కేరళలోని పత్రికల్లో వీటిగురించే వార్తలు. న్యూస్ చానళ్లలో వీటి గురించే కథనాలు. దీంతో అసలు గుడ్డు కొనాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మీడియాలో జరుగుతున్న హల్ చూసి కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
అయితే మీడియాలో ఇంతలా ప్రచారం జరుగుతున్నా ఇంత వరకూ తమకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని మంత్రి చెప్పారు. అయినా, పరిస్థితి తీవ్రత కారణంగా విచారణ జరిపిస్తామన్నారు. సాధారణంగా తమిళనాడు నుంచి తమ రాష్ట్రానికి గుడ్లు సరఫరా అవుతాయన్నారు. చైనా నుంచి దిగుమతి విషయమై ఆరా తీస్తామనిచెప్పారు.
సాధారణ గుడ్ల కంటే కృత్రిమ గుడ్ల తయారీ ఖర్చు చాలా తక్కువట. ఇంకేం, చైనా తన పాతబుద్ధిని చాటుకుంది. నకిలీల తయారీలో తన ప్రావీణ్యాన్ని మరోసారి ప్రదర్శించిందని కేరళ మొత్తం కోడై కూస్తోంది.
వీటిని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలించి అసలైన గుడ్లను మాత్రమే కొనుక్కోవాలని సూచిస్తున్నారు. రంగులో ఉన్న తేడాను సరిగ్గా గమనించాలని సలహా ఇస్తున్నారు.