శంకరాచార్యులపై చినజీయర్ చేసిన అనవసరపు ప్రసంగంతో ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య చిచ్చు రేగింది. చాలా కాలంగా అవి అంతర్గతంగా ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా కాలంలో చినజీయర్ వంటి వారు చేసే వ్యాఖ్యలతో కొత్తగా వాదోపవాదాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. చినజీయర్ తన ప్రసంగంలో శంకరాచార్యుల వారిపై ప్రధానంగా రెండు విమర్శలు చేశారు. ఒకటి, శంకరాచార్యులు పీఠాలను స్థాపించలేదని అవి తర్వాత వచ్చినవని , రెండు.. ఆయన వైష్ణవుడని, రామానుజుల కంటే ముందే నారాయణ తత్వాన్ని నమ్మారని చెబుతూనే, ఆయన బోధించిన అద్వైతం సరికాదనే ధోరణిలో మాట్లాడారు.
మనోభావాలను దెబ్బతీసిన చినజీయర్
చినజీయర్ వ్యాఖ్యలు శతాబ్దాల నాటి అద్వైత పరంపరను గౌరవించే స్మార్త బ్రాహ్మణులను , శంకర భక్తులను తీవ్రంగా గాయపరిచాయి. జీవించి లేని ఒక మహా పురుషుడి చారిత్రక ప్రాధాన్యతను సవాలు చేయడం ద్వారా చినజీయర్ అనవసరమైన వైషమ్యాలను రేకెత్తించారనేది ప్రధాన విమర్శ. నిజానికి శైవ, వైష్ణవ సిద్ధాంతాల మధ్య చర్చలు కొత్తేమీ కాదు. కానీ, చినజీయర్ స్వామి తన వైష్ణవ సిద్ధాంతాన్ని గొప్పగా చెప్పుకునే క్రమంలో శంకరాచార్యుల వారిని, వారి పీఠాధిపతులను కించపరిచేలా వ్యాఖ్యానించడం బ్రాహ్మణ వర్గంలో చీలికకుదారితీసింది. ఇది కేవలం ఆధ్యాత్మిక చర్చగా మిగిలిపోకుండా, సోషల్ మీడియా పుణ్యమా అని స్మార్తులు vs వైష్ణవులు అనే యుద్ధంగా మారిపోయింది.
వైష్ణవ ధర్మానికి ఏకైక ప్రతినిధిగా ఎదగాలనే తాపత్రయమా?
సమాజంలో శాంతిని ప్రబోధించాల్సిన గురువులు, ఇలాంటి చారిత్రక అంశాలను వివాదాస్పదం చేయడం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గం రెండుగా విడిపోయి వీధుల్లో పరస్పరం విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. కొందరు విశ్లేషకులు దీనిని చినజీయర్ స్వామి తన సంప్రదాయ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల తర్వాత, వైష్ణవ ధర్మానికి ఏకైక ప్రతినిధిగా ఎదగాలనే క్రమంలో ఆయన ఇతర సంప్రదాయాలను తక్కువ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ప్రక్రియలో ఆయన శంకరాచార్యుల వంటి విశ్వవ్యాప్త గౌరవం ఉన్న వ్యక్తిని విమర్శించడం ద్వారా తన స్వంత ప్రతిష్ఠను పణంగా పెట్టారు. దీనివల్ల ఆయన కొత్తగా సాధించేది ఏమీ లేకపోగా, హిందూ ధర్మంలోని ఐక్యతకు పెద్ద గండి పడిందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెప్పే ప్రవచనాలు పాటించరా?
ఆదిశంకరాచార్యులు భరతఖండాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేసిన వ్యక్తి. ఆయనను కేవలం ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయడం లేదా ఆయన ఉనికిని సవాలు చేయడం సామాన్య ప్రజలకు మింగుడు పడటం లేదు. చినజీయర్ స్వామి చేస్తున్న ఈ వ్యాఖ్యలు బ్రాహ్మణుల్లోని అంతర్గత వివక్షను బయటపెట్టడమే కాకుండా, వారిని చులకన చేస్తున్నాయి. ఇప్పటికైనా చారిత్రక సత్యాలను గౌరవిస్తూ, సిద్ధాంతపరమైన భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉండకపోతే, ఈ అంతర్గత కలహం మొత్తం సామాజిక వ్యవస్థకే చేటు తెస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
