కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. చిరంజీవిగా మారి నేటికి 47 ఏళ్లు. సరిగ్గా 47 ఏళ్ల క్రితం.. ఇదే రోజు ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలైంది. చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేసిన చిత్రమది. ఆ తరవాత చిరంజీవి అంచలంచెలుగా ఎదిగి… సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగిన వైనం అందరికీ చిరపరిచితమే. ఒక్కో అడుగూ వేసుకొంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఒక్కో ఇటుకా పేర్చుకొంటూ… ఇప్పుడు ఏకంగా ఓ సామ్రాజ్యాన్ని స్థాపించారు మెగాస్టార్. ఇండస్ట్రీ రికార్డులు ఎలా కొట్టాలో, వాటిని ఎలా తిరిగరాయాలో చిరంజీవికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదేమో..? నటనలో, స్టైల్ లో, డాన్స్ లో, ఎంటర్టైన్మెంట్ పంచడంలో.. చిరు ఓ ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకొన్నారు. ఆ దారే… చాలామంది హీరోలకు రహదారిగా మారి.. స్ఫూర్తిని పంచింది. మాస్ హీరో ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో వెండి తెరకు చూపించిన స్టార్ చిరంజీవి. నేల, బెంచి, బాల్కనీ.. ఈ కేటగిరీలన్నీ ఏకం చేసి.. అందర్నీ అభిమానులుగా మార్చుకొన్న స్టార్ చిరంజీవి. అందుకే 47 ఏళ్ల ఈ ప్రస్థానం ఇంకా దిగ్విజయంగా సాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో 155 చిత్రాల్ని పూర్తి చేసుకొన్నారు. రాబోయే మూడేళ్లలో కనీసం మరో 5 సినిమాలైనా చేయగలరు. మెగాస్టార్ 50 ఏళ్ల పండగను.. ఇండస్ట్రీ అంతా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తరుణం కోసం మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తన నటనా ప్రస్థానంలో 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే… ఈ ప్రయాణం సాధ్యమైందని, తనకొచ్చిన అవార్డులు, రివార్డులూ, పేరు ప్రఖ్యాతులూ.. ఇవన్నీ అభిమానుల ఆశీర్వాదబలం వల్లే అని, ఇక ముందు కూడా ఈ అభిమానం, ప్రేమ ఇలానే కొనసాగాలని ట్వీట్ చేశారు చిరంజీవి.