అక్కినేని కోసం అంజ‌నాదేవి సాహ‌సం

ఈ సంగ‌తి మీకు తెలుసా..? చిరంజీవి మాతృమూర్తి అంజ‌నాదేవి అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి వీరాభిమాని. అక్కినేని సినిమా చూడ‌డం కోసం ఆమె చాలా పెద్ద సాహ‌స‌మే చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ నేష‌న‌ల్ అవార్డు ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఆదివారం సాయింత్రం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. రేఖ‌, బోనీక‌పూర్ (శ్రీ‌దేవి త‌ర‌పున) చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరు. అంతేకాదు…త‌న త‌ల్లి ఏఎన్నార్‌కి వీరాభిమాని అని చెబుతూ ఓ సంఘ‌ట‌న క‌థ‌గా చెప్పి వినిపించారు.

“ఆరు ద‌శాబ్దాల క్రితం. ఓ ప‌ల్లెటూరులోని నిండు గ‌ర్భ‌వ‌తి. ప్ర‌స‌వానికి సిద్ధంగా ఉంది. అలాంట‌ప్పుడు పక్క టౌనులో త‌న అభిమాన క‌థానాయ‌కుడి సినిమా వచ్చింది. అది చూడాల‌న్న కోరిక‌ను భ‌ర్త ముందు వెలుబుచ్చింది. భార్య కోరిక కాద‌న‌కుండా ఆ భ‌ర్త ఓ జ‌ట్కా బండి పురమాయించి టౌనుకు బ‌య‌ల్దేరాడు. మ‌ధ్య‌లో చిన్న ప్ర‌మాదం కూడా జ‌రిగింది. భార్య‌కు చిన్న‌పాటి గాయాల‌య్యాయి. అయినా త‌ను గాయాల్ని లెక్క చేయ‌లేదు. `సినిమా చూసే ఇంటికి వెళ్తాం` అంది. భార్య కోరిక మేర‌కు ఆ భ‌ర్త సినిమా చూపించాడు. ఇంటికొచ్చాక భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ ఆనందించారు. ఆ భార్యాభ‌ర్త‌లెవ‌రో కాదు.. మా అమ్మానాన్న‌లు. అప్పుడు క‌డుపులో ఉన్న బిడ్డ‌ను నేనే. వాళ్లు చూడాల‌నుకున్న సినిమాలో హీరో ఏఎన్నార్‌. మా అమ్మ ఆయ‌న‌కు వీరాభిమాని. క‌డుపులో ఉండ‌గానే న‌న్ను సినిమాకి తీసుకెళ్లింది. అలా సినిమాపై నాక్కూడా ప్రేమ పుట్టిందేమో” అన్నారు చిరంజీవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com