డాన్స్ మాస్టర్లు డైరెక్షన్ చేయడం కొత్తేం కాదు. స్టార్ కొరియోగ్రాఫర్లంతా ఏదో ఓరోజు ఆ ముచ్చట తీర్చుకొన్నవాళ్లే. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నారని టాక్. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొన్నారు శేఖర్. స్టార్ హీరో సినిమాలకు డాన్స్ మాస్టర్ గా శేఖర్ పేరే గట్టిగా వినిపిస్తుంది. డాన్స్ మాస్టర్లలో అత్యధిక పారితోషికం తీసుకొంటోంది కూడా ఆయనే. కొన్ని రియాలిటీ షోల ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకూ పరిచయం. ఇప్పుడు డైరెక్టర్ అవ్వబోతున్నారని టాక్,
నృత్య దర్శకుడు ప్రభుదేవా కుమారుడైన రిషిల్ రాఘవేంద్ర దేవా త్వరలోనే వెండి తెరపై రానున్నారు.. హీరోగా. ఆయన కోసం శేఖర్ మాస్టర్ ఓ కథ రాశారట. ఇటీవల ప్రభుదేవాని కలిసి కథ కూడా చెప్పారని తెలుస్తోంది. ‘ప్రేమికుడు’ తరహాలో మ్యూజిక్, డాన్స్ మిక్స్ చేసిన ఓ ప్రేమకథ అని తెలుస్తోంది. మే నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శేఖర్ మాస్టర్ దర్శకుడిగా బిజీ అయితే మాత్రం టాలీవుడ్ హీరోలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ తో దాదాపు స్టార్ హీరోలంతా ట్యూన్ అయ్యారు. వాళ్లకు ఇది ఓరకంగా బ్యాడ్ న్యూసే అనుకోవాలి.

