ఎన్టీఆర్-మెగా ఫ్యామిలీ… లేని గొడవలను పెంచే ప్రయత్నం చేస్తున్నారా?

నందమూరి ఫ్యామిలీ గురించి తెరపైన కాస్త ఎక్కువగానే చెప్పుకున్నాడేమో కానీ తెరవెనుక మాత్రం ఎన్టీఆర్‌ని వెన్ను తట్టి ప్రోత్సహించినవాళ్ళు కానీ, సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అయినప్పటికీ తాత నందమూరి తారకరామారావు పోలికలతో పాటు, తను చిన్నప్పటి నుంచీ కష్టపడి నేర్చుకున్న నటన, నాట్యం నైపుణ్యాలతో తిరుగులేని స్టార్ ఢం సంపాదించాడు ఎన్టీఆర్. 2009 వరకూ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎన్టీఆర్‌ని సపోర్ట్ చేశారు. కానీ రాజకీయ ప్రచారంలోకి దిగడం, అందులో కూడా తన ప్రతభను పతాక స్థాయిలో చూపించడంతో, ఎక్కడ వారసుడికి పోటీ అవుతాడో అన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌కి నష్టం చేయడానికి చాలా మంది పనిగట్టుకుని కృషి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కి రెడీ అయినప్పుడల్లా వాళ్ళు పన్నిన కుయుక్తులన్నీ కూడా చాలా మందికి తెలిసి ఉన్నవే.

ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా కలెక్షన్స్‌తో మరోసారి తన స్టార్ ఢం పవర్ ఏంటో చూపించాడు ఎన్టీఆర్. కంటెంట్ విషయం చూసుకుంటే జనతా గ్యారేజ్ సినిమా మరీ గొప్పగా ఏమీ ఉండదు, కానీ కలెక్షన్స్ మాత్రం సినిమా స్థాయికి మించే వచ్చాయి. ఆ ఆనందంలో ఉన్న ఎన్టీఆర్‌కి ఎలా నష్టం చేయాలా అని కొంతమంది పనిగట్టుకుని వార్తలు రాస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సక్సెస్ మీట్ తర్వాత నుంచి ఆ రాతలు మరీ ఎక్కువయ్యాయి. ఎన్టీఆర్‌కి నష్టం చేయడంతో పాటు సినిమా స్టార్స్ అభిమానుల మధ్య గొడవలను కూడా పెంచేలా ఉన్నాయి ఆ రాతలు. మెగా ఫ్యామిలీ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సింహాద్రితో ఎన్టీఆర్ సాధించిన రికార్డ్స్ అన్నింటినీ మెగా హీరోలు బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అన్ని రకాల కలెక్షన్స్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమా కూడా చాలా సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్‌ని దాటేసింది. అప్పుడెప్పుడూ కూడా ఆ రికార్డ్స్ బ్రేక్ చేసిన హీరోలను మెగా హీరోలతో పోలుస్తూ వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం చాలా మంది మెగా హీరోల కలెక్షన్స్‌తో పోలుస్తూ వార్తలు రాస్తున్నారు. మరికొంత మంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అల్లు అర్జున్ టెన్షన్ పడుతున్నాడని వార్తలు రాస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలకు చెక్ చెప్పిన ఎన్టీఆర్ అంటూ వార్తలు వండుతున్నారు.

రీసెంట్‌గా ఇద్దరు హీరోల అభిమానుల గొడవలో ఓ అభిమాని చనిపోయినప్పుడు ఇప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే రాతలు రాస్తున్నవాళ్ళే బోలెడన్ని కన్నీళ్ళను వార్తల రూపంలో కార్చేశారు. ఆయా హీరోలదే తప్పు అని కూడా చాలా మంది చెప్పేశారు. హీరోల తప్పులను పక్కన పెడితే మీడియా చేస్తున్న తప్పుల మాట ఏంటి? ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అల్లు అర్జున్ ఎందుకు టెన్షన్ పడతాడు? తెలుగు సినిమాల కలెక్షన్స్ స్థాయి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. గత సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ చెరిగిపోతూ ఉండడం అనేది చాలా సాధారణ విషయం అయిపోయింది. రేపు పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్‌ల సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే జనతా గ్యారేజ్ కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ కూడా చెరిగిపోతాయి. అంతోటి దానికి ఎన్టీఆర్‌కి, మెగా హీరోలకు ఏదో రైవల్రీ ఉన్నట్టుగా ఎందుకు వార్తలు రాస్తున్నారు? అభిమానుల మధ్య ఉండే గొడవలను క్యాష్ చేసుకుందామన్న దురుద్ధేశ్యమా? ఆ ప్రయత్నంలోనే తమ రాతలతో హీరోల అభిమానుల మధ్య గొడవలను పెంచుతున్నారన్న విషయం మర్చిపోతున్నారా? మెగా హీరోలందరితోనూ ఎన్టీఆర్‌కి మంచి రిలేషన్సే ఉన్నాయి. అసలు ఇప్పుడు తెలుగు హీరోలెవ్వ రూ కూడా సాటి హీరోలతో కానీ, ఆ హీరోల అభిమానులతో కానీ ఎలాంటి విభేదాలూ తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. హీరోలందరూ కూడా తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించి మేక్సిమం కలెక్షన్స్ రాబట్టుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే రెచ్చిపోతున్న అభిమానులను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా కూడా ఆ విషయం అర్థం చేసుకుని అభిమానుల మధ్య గొడవలను పెంచి పోషించేలా రాతలు రాయకుండా ఉంటే చాలా బాగుంటుంది. తెలుగు సినిమా పుణ్యమా అని బ్రతుకుతున్నవాళ్ళు… కాస్త ఆ సినిమా పరిశ్రమకు మంచి చేసే వార్తలు కూడా రాస్తూ ఉంటే బాగుంటుందేమో. అంతకంటే కూడా అనాలోచితంగా, ఆవేశంతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసుకుని చెత్త కామెంట్స్ చేస్తూ శునకానందాన్ని పొందుతూ ఉండేవాళ్ళకు మరికాస్త మసాలా అందించడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com