ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో లాయర్ గా మారి వాదనలు వినిపించడం దేశ చరిత్రలో మొదటి సారి . ఆ ఘటన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సాధించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై బెంగాల్ ప్రభుత్వం తరపున కోర్టులో పిటిషన్ వేశారు. తానే స్వయంగా వాదనలు వినిపిస్తానని సుప్రీంకోర్టును కోరారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆమె గతంలో లా పాసయ్యారు. లాయర్‌గా కూడా నమోదు చేసుకున్నారు.
ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా వాదనలు వినిపించడంపై అంతటా ఆసక్తి వ్యక్తమయింది. ఆమె వాదనలు సుప్రీంకోర్టు బెంచ్ ముందు వినిపించారు. ఈ SIR ప్రక్రియ కేవలం ఓటర్ల పేర్లను తొలగించడానికే ఉపయోగపడుతోందని ఆరోపించారు. మైక్రో అబ్జర్వర్లను కేవలం బెంగాల్లోనే నియమించారని పేర్కొన్నారు. పంట కోతల సమయంలో, పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. బతికున్న వారిని కూడా చనిపోయినట్లు చూపిస్తూ ఓట్లు తొలగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని ఆమె చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు తమ చర్యలను సమర్థించుకున్నారు. ఓటర్లకు వ్యక్తిగతంగా నోటీసులు పంపుతున్నామని, ఎవరినీ అన్యాయంగా తొలగించడం లేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ వాదనలను విన్న సుప్రీంకోర్టు, ఈ వివాదంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ లోపు పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిష్కారణంగా ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.


