జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలుగువాళ్లంతా గెలిపించాలని కేసీఆర్, చంద్రబాబు,పవన్ కల్యాణ్, జగన్ అందరూ తమ పార్టీ ఎంపీల ద్వారా ఓట్లు వేయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిలో ఆయన తెలుగు సెంటిమెంట్ జోడించారు. గతంలో పీవీ నంద్యాలలో పోటీ చేస్తే ఎన్టీఆర్ పోటీ పెట్టలేదన్నారు. సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదన్నారు. ఆయన బీసీ రిజర్వేషన్ల కోసం గట్టిగా కృషి చేసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.
అయితే రేవంత్ తెలుగు సెంటిమెంట్ ను గట్టిగానే వినిపించారు. మరి ఇదే సెంటిమెంట్ తమిళనాడులో అక్కడి పార్టీలు కూడా పాటిస్తే.. మొదటికే మోసం వస్తుంది. బీజేపీ అభ్యర్థికే మొత్తం తమిళనాడు రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు మద్దతుగా నిలుస్తారు. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది?. ఆయన పార్టీ అభ్యర్థి..సుదర్శన్ రెడ్డి న్యాయకోవిదుడు అని రేవంత్ సమర్థించుకోలేరు. ఎందుకంటే ఆయన పోటీ పడుతోంది ఇండీ కూటమి తరపునే. అంటే ఆయన రాజకీయ పార్టీకే ప్రాతినిధ్యం వహిస్తారు.
పరిస్థితి చూస్తూంటే.. సుదర్సన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డినే ప్రతిపాదించారన్న అభిప్రాయం కలుగుతుంది. ఖచ్చితంగా ఓడిపోయే దానికి పోటీ చేయడం ఎందుకని ఎవరూ మందుకు రాలేదు. కాస్త బలమైన అభ్యర్థిని పెట్టాలన్న ఉద్దేశంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డిని రేవంత్ ప్రతిపాదించారు. దానికి హైకమాండ్ అంగీకిరంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన తెలుగు సెంటిమెంట్ జోడిస్తున్నారు. ఏపీ కన్నా.. తమిళనాడులోనే భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తించలేకపోతున్నారు.