ప్రొ.నాగేశ్వర్ : ఎన్టీఆర్ వారసత్వం కోసం నారా, నందమూరి మధ్య పోటీ ఉందా..?

తెలుగుదేశం రాజకీయాల్లో నందమూరి రామారావు వారసత్వం ఎవరికి ..? ఎన్టీఆర్ నిజమైన వారసుడు ఎవరు..? అనే ప్రశ్న తరచూ వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ మరణానంతరం.. ఇది కొన్నాళ్లు కీలక అంశంగా ఉంది. ఆ తర్వాత తగ్గిపోయింది. అయితే నందమూరి, నారా కుటంబాల మధ్య ఒక రకమైన పోటీ మనకు ఎప్పుడూ కనిపిస్తుంది. లక్ష్మిపార్వతి విషయంలో… ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసినప్పుడు కుటుంబం అంతా.. చంద్రబాబు వెంట ఉంది. హరికృష్ణ కూడా.. అప్పుడు.. చంద్రబాబు వెంటే ఉన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మిపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. అందువల్లే తిరుగుబాటు వచ్చిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతూ ఉంటారు.

టీడీపీలో ఎన్టీఆర్ వారసుడు ఎవరు..?

ఎన్టీఆర్ తర్వాత నిజంగా ఆయన వారసులు ఎవరు..? చంద్రబాబునాయుడు, లోకేష్ ఓ వైపు ఉన్నారు. మరో వైపు.. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరైనా ఉన్నారా..? చంద్రబాబునాయుడు చాతుర్యం, రాజకీయ దక్షత.. టీడీపీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎన్టీఆర్ హయాంలోనే.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లో ఉండేది. పార్టీ నిర్మాణంపై చంద్రబాబుకు ఉన్న పట్టు వల్ల ఇది సాధ్యమయింది. ఎప్పుడైతే.. ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పుడే చాలా మందికి అనుమానాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు వారి కుటుంబ వారసుడా..? ఎన్టీఆర్ వారసుడా..? అనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయింది. ఓ దశలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారని.. టీడీపీకి నాయకత్వం వహిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా రెండు సార్లు చంద్రబాబుకు ఇలాంటి సవాల్ వచ్చింది. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కుటుంబంలో భాగమే. కానీ ఎన్టీఆర్ కుటుంబాన్ని నందమూరి, నారా కుటుంబాలుగా వర్గీకరిస్తే.. నందమూరి కుటుంబం నుంచి చంద్రబాబుకు రెండు సార్లు సవాల్ వచ్చింది.

చంద్రబాబు పోటీ లేకుండా చూసుకున్నారా..?

1995లో తెలుగుదేశంలో జరిగిన పరిణామాల్లో… ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా.. చంద్రబాబు వెనుక అందరూ సమీకృతమైనప్పుడు.. కుటుంబం కూడా కలసి వచ్చింది. హరికృష్ణ కూడా చంద్రబాబుతో కలసి వచ్చారు. దీనికి ప్రతిగా హరికృష్ణను చంద్రబాబునాయుడు కేబినెట్ లోకి తీసుకున్నారు. రవాణా మంత్రి అయ్యారు. కానీ ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే అయితేనే మంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చంద్రబాబు తల్చుకంటే.. ఏదో ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి.. ఆ స్థానంలో పోటీ చేయించి.. ఎమ్మెల్యేగా గెలిపించి ఉండేవారు. కానీ హరికృష్ణ కేబినెట్ లో కొనసాగితే.. ఓ పవర్ సెంటర్ లా.. నందమూరి కుటుంబం నుంచి ఉంటారని.. అలా ఉంటే.. ఎప్పటికైనా ప్రమాదమని.. చంద్రబాబు అనుకుని ఉంటారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోతే.. మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా.. చంద్రబాబు అలర్ట్ కాలేదు. దాంతో హరికృష్ణ మంత్రి పదవి పోయింది. తర్వాత 1996లో ఎన్టీఆర్ మరణానంతరం.. హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా అవకాశం ఉంది. కానీ చంద్రబాబు హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆ విధంగా.. ఓ వైపు నుంచి నందమూరి కుటుంబాన్ని కలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే తనకు సవాళ్లు రాకుండా చూసుకున్నారు. ఈ కారణంగానే.. హరికృష్ణ టీడీపీని వీడి.. అన్న తెలుగుదేశం పార్టీని పెట్టారు.

టీడీపీని కింది స్థాయి నుంచి నిర్మించింది చంద్రబాబునాయుడే..!

లక్ష్మిపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టి ఫెయిలయ్యారు. హరికృష్ణ అన్న టీడీపీ పెట్టడానికి కారణం.. ఎన్టీఆర్ రామారావుకు తానే నిజమైన వారుసుడ్ని .. చంద్రబాబు కాదు..అని హరికృష్ణ చెప్పదల్చుకున్నారు. ఎన్టీఆర్ వారసుడు.. కుమారుడే తప్ప.. అల్లుడు కాదని… మెసెజ్ పంపారు. కానీ చంద్రబాబుకు ఉన్నన్ని రాజకీయ లక్షణాలు కానీ.. రాజకీయ దక్షత కానీ .. ఎత్తుగడలు వేయడం.. వ్యూహాలు రచించడంలో కానీ సామర్థ్యం లేదు. దానికి తగ్గట్లుగానే..అన్న తెలుగుదేశం సక్సెస్ కాదు. ఆ మాటకొస్తే.. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడే… చంద్రబాబునాయుడుపై తిరగబడ్డారు. కానీ ప్రజలెవరూ.. ఎన్టీఆర్ వెనుకాల రాలేదు. ఎన్టీఆర్ అంటే ప్రజలకు గౌరవం లేక కాదు. లక్ష్మిపార్వతి రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారనే అంశాన్ని ప్రజలు అంగీకరించారు. అలాగే పార్టీపై చంద్రబాబుకు పూర్తి స్థాయిలో పట్టుంది. రెండు కారణాల వల్ల చంద్రబాబు.. ఎన్టీఆర్ పై తిరుగుబాటులో విజయం సాధించగలిగారు. ఒకటి ఆ రోజు ఎన్టీఆర్ లక్ష్మిపార్వతికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం. దీన్ని పార్టీలో ఏ ఒక్కరూ సహించలేకపోయారు. దీని వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇక రెండోది పార్టీ నిర్మాణం. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు సాధారణంగా పార్టీ నిర్మాణం ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంది. ఈ పార్టీ నిర్మాణాన్ని.. మొదటి నుంచి చంద్రబాబే చూశారు. అందువల్ల ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసినా… పార్టీ మొత్తం చంద్రబాబు వెంటే ఉంది. అలాగే ఎన్టీఆర్ కుమారుడిగా పార్టీ పెట్టినా.. నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబానికి సవాల్ ఏర్పడినా.. దాన్ని చంద్రబాబు ఎదుర్కోగలిగారు.

జూ.ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదా..?

2009లో చంద్రబాబుకు మరో సవాల్ ఎదురయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటికి ఐదేళ్లు ఉన్నా.. పెద్దగా అధికార వ్యతిరేకత లేదు. అదికారంలో లేని పార్టీగా టీడీపీ సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే ప్రతిపక్షాలన్నింటితోనూ పొత్తులు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ తోనూ కలసి పోటీచేశారు. అక్కడితో ఆగకుండా.. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించారు. జూనియర్ ఎన్టీఆర్‌ 2009 ఎన్నికల్లో ప్రచారంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అప్పుడు టీడీపీ గెలిచి ఉంటే… టీడీపీ గెలవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే కారణమన్న అభిప్రాయానికి వచ్చేవారు. అప్పటికీ లోకేష్ రాజకీయాల్లో లేరు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు … టీడీపీ నాయకత్వం కోసం బలమైన పోటీ దారులుగా ఉండేవారు. కానీ.. అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇది ఓ రకంగా చంద్రబాబునాయుడికి కలసి వచ్చింది. ఓడిపోయినా టీడీపీ నాయకత్వం విషయంలో.. ఆయనకు క్లారిటీ వచ్చింది.

ఇక ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబే..!

2014 కి వచ్చే సరికి.. రాష్ట్రం విడిపోయింది. అప్పటికే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న… హరికృష్ణ రాజీనామా చేశారు. కానీ.. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఏపీకి ఓ అనుభవజ్ఞుడైన నాయకత్వం కావాలన్న అంశం తెరపైకి వచ్చింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అవసరం చంద్రబాబుకు రాలేదు. 2014 ఎన్నికల్లో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కనిపించలేదు. ఈ లోగా… నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే.. ఎన్టీఆర్ కుటుంబంలోని మరో సెలబ్రిటీగా ఉన్న బాలకృష్ణ వియ్యంకుడు అయ్యారు. ఆ తరవాత రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం ఎమ్మెల్యేగా అయ్యారు. అలాగే పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుందేశ్వరి చాలా రోజుల నుంచి టీడీపీ రాజకీయాల్లో లేరు కనుక… సవాల్ కాలేదు. ఇక ముందు కాలేరు కూడా. ఇంతకు ముందు అంతో ఇంతో హరికృష్ణ .. చంద్రబాబుకు సవాల్ చేసినట్లు ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. టీడీపీలో చంద్రబాబుకు సవాల్ చేసే వారు లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.