పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పకుండా చెయ్యాలి. కానీ దాని కోసం త్రవ్వి పోస్తున్న లక్షల కొద్ది క్యూబిక్ మీటర్ల మట్టిని ఎక్కడ పోస్తున్నారు? అనే అనుమానం ఎవరికీ కలిగి ఉండకపోవచ్చును. కానీ అ మట్టితో తమ జీవితాలే మట్టిపాలయిపోతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన పి పుల్లారావు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పిర్యాదు చేసాడు. ఇదివరకు లోక్ సభలో కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఈ మట్టిని పోయడానికి అటవీ శాఖకు చెందిన 3427.52 హెక్టార్ల భూమిని కేటాయించాము. ఈ ప్రాజెక్టు క్రింద రెండు లక్షల ఎకరాలు మునిగిపోతుంది,” అని జవాబు చెప్పారు.
దానిని బట్టి ఈ ప్రాజెక్టు నుండి ఎంత భారీ స్థాయిలో మట్టిని త్రవ్విపోస్తున్నారో గ్రహించవచ్చును. దానిలో కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాజెక్టుకి సమీపంలో ఉన్న గ్రామాలలో తెచ్చి పోస్తుండటంతో తమ పంట భూములు, తమ జీవనదారమయిన వ్యవసాయం అన్నీ దెబ్బ తింటున్నాయని పుల్లారావు చేసిన పిర్యాదుపై స్పందిస్తూ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ మూడు కలిసి తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తగు నివారణ చర్యలు చేప్పట్టవలసిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ సమస్య గురించి పూర్తి వివరాలు సేకరించిన తరువాత తదుపరి చర్యలు తీసుకొంటామని తెలియజేస్తూ ఈ కేసును రద్దు చేసింది.