నకిలీ మద్యం తయారు చేయించి ప్రభుత్వంపై కుట్ర చేయాలనుకున్న జోగి రమేష్ బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది. కానీ ఆయన జైలు నుంచి విడుదల కాలేరు. ఇబ్రహీనంపట్నం కేసులోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ములకలచెరువు కేసులో ఆయనకు బెయిల్ రావాల్సి ఉంది. ఆ కేసులోనూ బెయిల్ వస్తే ఆయన విడుదల అవుతారు. అయితే ఆయనపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేసిన కేసు నుంచి చాలా ఉన్నాయి. వాటిలో ఏమైనా తెరపైకి తీసుకు వస్తారా లేదా అన్నది పోలీసుల ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది.
గత నవంబర్ లో జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసు బయటపడినప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావును సౌతాఫ్రికా నుంచి రప్పించి అరెస్టు చేశారు. అద్దేపల్లి బ్రదర్స్ తో కలిసి వైసీపీ హయాంలో నకిలీ మద్యం వ్యాపారాన్ని జోగి రమేష్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని పట్టించి.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలనుకున్నారు. కానీ దొరికిపోయారు. తనను బలి చేయాలని జోగి రమేష్ ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించి అద్దేపల్లి పూర్తిగా నిజాలు బయట పెట్టారు. దీంతో జోగి బ్రదర్స్ ఇరుక్కుపోయారు.
జోగి రమేష్ జైలుకెళ్లినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. మొదటి రెండు, మూడు రోజులు పరామర్శించారు. ఆ తర్వాత మర్చిపోయారు. కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు కూడా ఆయన కోసం ఎవరూ వచ్చేవారు కాదు. జగన్ రెడ్డి కోసం జైలుకు పోయినా తనను పట్టించుకోవడంలేదని ఆయన మథనపడుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు జగన్ దగ్గర ఉండటం మినహా మరో మార్గం లేదు.
