బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం, కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత సీజే రాయ్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు తీసుకోవడం పలు అనుమానాలకు, వివాదాలకు దారితీస్తోంది.
బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో గత మూడు రోజులుగా కేరళకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయ్ నివాసాలు, కార్యాలయాల్లో ఏకధాటిగా తనిఖీలు చేస్తున్నారు. సోదాల సమయంలో అధికారులతో మాట్లాడిన రాయ్, కొన్ని డాక్యుమెంట్లు తీసుకువస్తానని చెప్పి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే గదిలో నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా, రాయ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్డ్ పిస్టల్‌తో ఛాతిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.
సీజే రాయ్ ఆత్మహత్యకు ఐటీ అధికారుల వేధింపులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆయన సంస్థలపై పలుమార్లు ఐటీ దాడులు జరిగాయని, ఈసారి కేరళ నుంచి వచ్చిన బృందం పదేపదే ప్రశ్నించడం ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలుస్తోంది. కాన్ఫిడెంట్ గ్రూప్ ఆదాయపు పన్ను వివాదాలకు సంబంధించి హైకోర్టు , అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌లో దీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తోంది. రాయ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో, వారు వచ్చిన తర్వాత ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తామని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.
ర్యాప్తు పేరిట అధికారులు ఒక వ్యక్తి ప్రాణం పోయేలా ప్రవర్తించడం సరికాదని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రకటించారు. అటు అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, దర్యాప్తుకు ఆయన సహకరిస్తున్న సమయంలోనే ఈ ఊహించని ఘటన జరిగిందని పేర్కొంటున్నారు.
కేరళకు చెందిన రాయ్, బెంగళూరులో స్థిరపడి కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ఒక దిగ్గజ సంస్థగా మార్చారు. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కూడా ఆయనకు మంచి పేరుంది. మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీయడమే కాకుండా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు స్పాన్సర్‌గా కూడా వ్యవహరించారు. ఆయన తన విలాసాన్ని ప్రదర్శించుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఆయన ఆత్మహత్య ఇప్పుడు వ్యాపార రంగంలో ఓ రకమైన భయాన్ని సృష్టిస్తోంది.
