సెప్టెంబరు 5న ‘మిరాయ్’ అంటూ ఇది వరకే నిర్మాతలు ప్రకటించారు. కానీ మధ్యలో ఏవో అనుకోని అవాంతరాలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు పూర్తి కాలేదని, కనీసం రెండు వారాల ఆలస్యంగా ‘మిరాయ్’ని విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఎందుకైనా మంచిదని సెప్టెంబరు 12 డేట్ కూడా బ్లాక్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
అయితే ‘ఓజీ’కి పోటీగా ‘మిరాయ్’ని తీసుకొస్తారన్న ప్రచారం మరోవైపు ఊపందుకొంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’ వస్తోంది. దానిపై ‘మిరాయ్’ పోటీ అన్నమాట. అలాగైతే… ‘మిరాయ్’ నలిగిపోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే ‘ఓజీ’పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం అంచనాలు లేని ‘హరి హర వీరమల్లు’ ప్రీమియర్ షో టికెట్లే హాట్ కేకుల్లా అమ్ముడై, సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అలాంటప్పుడు ‘ఓజీ’ ఇంకెంత ఇంపాక్ట్ చూపించగలదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గుంటూరు కారం’తో పోటీగా దిగిన తేజా సజ్జా అప్పట్లో `హనుమాన్`తో హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఫీట్ రిపీట్ అవుతుందేమో అనే నమ్మకం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉండొచ్చు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరో గాసిప్పు మొదలైంది. ‘ఓజీ’ రావడం అనుమానంగా ఉందని, అందుకే `మిరాయ్`ని రంగంలోకి దింపుతున్నారని టాక్. ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై ఇది వరకే చాలా రూమర్లు వచ్చాయి. ప్రతీసారీ నిర్మాణ సంస్థ స్పందిస్తూనే ఉంది. ‘ఓజీ’ ఈసారి రిలీజ్ కావడం పక్కా అని, డేట్ మారే ఛాన్సే లేదని నిర్మాణ సంస్థ గట్టిగానే చెబుతూ వచ్చింది. కాబట్టి ‘ఓజీ’ వాయిదా అనేది కేవలం ఊహాగానం మాత్రమే అనుకోవాలి.
ఈరోజు ‘మిరాయ్’ నుంచి ఓ ప్రెస్ నోట్ వచ్చింది. అందులో అయితే రిలీజ్ డేట్ సెప్టెంబరు 5నే అనే చెప్పారు. సెప్టెంబరు 5నే అయితే… ప్రమోషన్లు ఇంకా మొదలు కాలేదు. కనీసం ఈరోజు తేజా సజ్జా పుట్టిన రోజు సందర్భంగా కనీసం ట్రైలర్ అయినా రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ నిర్మాణ సంస్థ మాత్రం మిన్నకుండిపోయింది. తెర వెనుక ఏం జరుగుతుందో మరి.