ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది ప్రజలకు సంబంధించిన అంశంగా కాక రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ చదరంగంగా మారింది. దానిని ఉపయోగించుకొని ప్రతిపక్షాలు తమ పార్టీలను బలోపేతం చేసుకొంటూ మరో వైపు అధికార తెదేపా, బీజేపీలను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి. ఇంతవరకు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పోరాడితే ఇప్పుడు దాని చేతిలో నుండి వైకాపా అందిపుచ్చుకొని పోరాటం మొదలుపెట్టింది. ఈ వ్యవహారం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారయింది తెదేపాకి. కానీ ఈ ప్రత్యేక పోరాటాల కోసం తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఇంకా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
తెదేపా లేదా తెరాస ప్రభుత్వాలు ఏ పధకం ప్రవేశ పెట్టినా “అవి తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలే…వాటిని కాపీకొట్టేసి పేర్లు మార్చేసి తనవిగా ప్రచారం చేసుకొంటున్నాయి…ఇది అన్యాయం…అక్రమం,” అని అరిచి గోలగోల చేసే కాంగ్రెస్ నేతలు, తాము మొదలుపెట్టిన ఈ ప్రత్యేక పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి హైజాక్ చేసి ఎత్తుకొనిపోయినా అభ్యంతరం చెప్పకపోవడం చాలా అనుమానాలు కలిగిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి ఈ ప్రత్యేక హోదా సంజీవనీ మూలికలాగా ఉపయోగపడుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా, రాష్ట్రంలో జీవచ్చవంలాగ మారిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం అది ఖచ్చితంగా సంజీవని మూలికలాగ ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. అందుకే ఆ పార్టీ అధిష్టానం ముందస్తు జాగ్రత్తగా ఈ మూలికని డాక్టర్ మన్మోహన్ సింగ్ ద్వారా సిద్దం చేయించి ఉంచిందేమో కూడా? అటువంటి దివ్యౌషదాన్ని జగన్ కాకిలాగ ఎత్తుకుపోతే కాంగ్రెస్ నేతలెవరూ ఆయనని పల్లెత్తుమాటనలేదు. అభ్యంతరం చెప్పలేదు??? పైగా ఇంతరకు ఉదృతంగా చేసిన తమ ఈ ప్రత్యేక పోరాటాల స్పీడుని కూడా బాగా తగ్గించేసుకొన్నారు. ఎందుకు?
ఈ విషయంలో రాహుల్ గాంధీ వైకాపాని హెచ్చరించిన తరువాతనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తన దూకుడు తగ్గించుకొంటే, అప్పటి నుండి ఈ అంశంపై జగన్ దూకుడుగా ముందుకు సాగుతుండటం ప్రజలు కూడా గమనించే ఉంటారు. రాహుల్ గాంధీ హెచ్చరించగానే దానిపై జగన్ తక్షణమే స్పందించి డిల్లీలో దీక్ష చేయడం, తరువాత 29న రాష్ట్ర బంద్ చేయడం (దానికి కాంగ్రెస్ మద్దతు తెలుపలేదు!!!) అసెంబ్లీలో దీనిపై రగడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రెండు వారాలు డెడ్-లైన్ విధించి ఈనెల 16నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నిన్న ప్రకటించడం అన్నీ గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య ఏదో అవగాహన కుదిరినట్లే అనుమానం కలుగుతోంది. లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకున్న ఈ ఏకైక గొప్ప అవకాశాన్ని ఆ పార్టీ ఉపాధ్యక్షుడే తన స్వహస్తాలతో జగన్ చేతిలో పెట్టబోరు కదా? అంటే కాంగ్రెస్ పార్టీలో వైకాపా మున్ముందు విలీనమయ్యే అవకాశాలున్నట్లు అనుమానం కలుగుతోంది. బహుశః అందుకే కాంగ్రెస్ తన ప్రత్యేక పోరాటాన్ని జగన్ చేతికి అప్పగించి సైలెంట్ అయిపోయినట్లు స్పష్టమవుతోంది.
కానీ ఈవిదంగా చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం? అని ప్రశ్నించుకొన్నట్లయితే రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకోవడానికి ఇది ఒక్కటే దారి అని చెప్పుకోవచ్చును. ఒకవేళ జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయితే ఆ రెండు పార్టీల సమైక్యశక్తి ముందు తెదేపా తట్టుకోవడం కష్టమే. ఒకవేళ వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగితే ముఖ్యమంత్రి కావాలనే జగన్ కోరిక తీరుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోకుండా కాపాడుకోవచ్చు కూడా. ఈవిధంగా రెండు పార్టీలకు ఎంతో ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది కనుకనే మళ్ళీ ఆ రెండు పార్టీలు క్రమంగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈ ప్రత్యేక అవగాహన కుదుర్చుకొన్నాయేమో? ఏమో? కాలమే అన్ని అనుమానాలు తీర్చాలి.