జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటే విడుదల చేయనున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థి విషయంలో నాన్చివేత ధోరణినే పాటిస్తోంది. ఫలితంగా ఆశలు పెంచుకుంటున్న నేతలు పెరిగిపోతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ చేస్తున్న హడావుడి చేస్తే రేపు టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఆయన గాంధీభవన్ ను బద్దలు కొట్టించినా ఆశ్చర్యం ఉండదని కాంగ్రెస్ నేతలు కూడా కంగారు పడుతున్నారు.
జూబ్లిహిల్స్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన అజారుద్దీన్ ను ప్లాన్డ్ గా పక్కకు తప్పించారు రేవంత్. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపేందుకు తీర్మానం చేశారు. ఇదంతా నవీన్ యాదవ్ కోసమేనని కాంగ్రెస్ లో ఎక్కువ మంది నమ్మకం. రేవంత్ కూడా ఎక్కడా బయటకు ఆ విషయం చెప్పలేదు కానీ.. ఇస్తున్న ప్రయారిటీని బట్టి క్లారిటీ వస్తుంది. కానీ ఆయనకు ఇవ్వొద్దని.. తాము కూడా పార్టీ నేతలమేనని చాలా మంది ముందుకు వస్తున్నారు. చివరికి దానం నాగేందర్ కూడా ప్రయత్నించారు. ఇప్పుడు పాతబస్తీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ దిగిపోయారు.
చాన్స్ లేదని అంజన్‌కుమార్ కు ముందుగానే చెప్పాల్సింది కానీ చెప్పలేదు. ఆయనకు గతంలో టిక్కెట్ ఇచ్చారు.. ఆయన కుమారుడికి రాజ్యసభ ఇచ్చారు. అయినా ఇప్పుడు తనకు సంబంధం లేని నియోజకవర్గం అయినా సరే జోక్యం చేసుకుని టిక్కెట్ కావాల్సిందే అంటున్నారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి..హామీలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థిని ఖరారు చేసేందుకు మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. ఆమె ముందు కూడా హడావుడి చేయడం ఖాయం.
బీఆర్ఎస్ పార్టీ తరపున ఇప్పటికే మాగంటి సునీతకు టిక్కెట్ ఖరారు చేశారు. పార్టీ నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతలు ఇచ్చారు కేటీఆర్. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల వరకూ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపించడం లేదు. నవీన్ యాదవ్ అన్ని విధాలుగా సరైన అభ్యర్థి అనే నిర్ణయానికి వచ్చినా ప్రకటించలేకపోతున్నారు.