రాజకీయాలు ఎలా చేయకూడదో కాంగ్రెస్ పార్టీ నేతల్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలేమో ?. ఓ వైపు ప్రత్యర్థి పార్టీ సానుభూతి పవనాలపై నమ్మకంతో అభ్యర్థిని నిలబెట్టినప్పుడు .. ఆ సానుభూతిని పెంచేలా ఎవరైనా మాట్లాడతారా?. కానీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె సానుభూతి కోసమే స్టేజ్ పై ఏడుస్తున్నారని దెప్పిపొడుస్తున్నారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్ ఇలా మాట్లాడిన వీడియోలను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేసి.. విమర్శలు గుప్పిస్తున్నారు.
వీరి మాటలతో ప్రజల్లో అహంకారం అన్న అభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ కు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో కానీ.. ఆయన చనిపోయారు. రాజకీయం అన్న తర్వాత అందరూ అభిమానించరు..అందరూ వ్యతిరేకించరు. రెండు వర్గాలూ ఉంటాయి. కానీ చనిపోయిన నేతను .. వారి కుటుంబాన్ని కించపర్చడాన్ని మాత్రం చాలా మంది సహించరు. ఆ విషయం రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా.. తన భాషా వ్యక్తికరణలో తడబడుతున్నారు. పీజేఆర్ గొప్పగా పని చేశారని చెప్పే క్రమంలో ఆయన కూడా నాన్ లోకేలే అని చెప్పడం వివాదాస్పదం అయింది. మాగంటి గోపీనాథ్ మరణంపై మాట్లాడే సమయంలో.. ఆయన మరణం దైవనిర్ణయం అన్నారు. నవీన్ యాదవ్ ఉద్దేశం వేరు..కానీ ఆ మాటతో ప్రజల్లోకి వెళ్లే భావం వేరు. శ్రీశైలం యాదవ్ కూడా కొన్ని యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో మాగంటి గోపీనాథ్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
