తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారు. ఏకగ్రీవాలతో పాటు ఎన్నికలు జరిగిన చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రచారం చేసిన వారు మెజార్టీ స్థానాల్లో గెలుస్తున్నారు. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి కూడా మరీ తీసిపోలేదు. బలంగానే గ్రామ స్థాయిలో తన ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే 80 శాతం స్థానాలను కోల్పోతున్నారు. మొత్తం 4200కుపైగా పంచాయతీలు ఎన్నికలు జరుగుతూండగా.. ఏకగ్రీవాలతో సహా 1500 పంచాయతీల ఓట్ల లెక్కింపు ఫలితాలు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వెయ్యి పంచాయతీలను గెల్చుకుంది.
భారత రాష్ట్ర సమితి మూడు వందల పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకుంది. బీజేపీ ఓ మాదిరి ప్రభావాన్ని చూపింది. ఏ పార్టీకి చెందకుండా.. స్వతంత్రంగా పోటీ చేసిన వారు 200 పంచాయతీల్లో సర్పంచ్‌లుగా గెలిచారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఎక్కడా ఘర్షణలు జరగలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో ఫలితాలు వెంటనే వస్తున్నాయి.
సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతం. పార్టీల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వరు. అయితే ఫలానా నేత కాంగ్రెస్.. ఫలానా నేత బీఆర్ఎస్ అని అందరికీ తెలుసు. ఆయా పార్టీల నేతలు కూడా.. తమ పార్టీ మద్దతుదారులు అనే ప్రచారం చేశారు. ఇలా.. వారు ఫలానా పార్టీ అని ప్రచారం చేసుకోవడమే కానీ అధికారికం కాదు. అందుకే.. లెక్కలు కొన్ని తారుమారు చేసుకుని మా పార్టీ ఎక్కువ గెలిచిందంటే.. మా పార్టీ ఎక్కువ గెలిచిందని ప్రాచరం చేసుకునే అవకాశం ఉంది.