జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారారు. ఇప్పసారా ఆరోగ్యానికి మంచిది అంటూ ఆయన చేస్తున్న వితండవాదం వింటుంటే, ఆయనకు అసలు విచక్షణ ఉందా లేక నిజంగానే చిప్ ఏమైనా దెబ్బతిన్నదా అన్న సెటైర్లు ఆయనపై పడుతున్నాయి. అందుకే ఆయన తన వాదనను సమర్థించుకోవడానికి ఇప్పుడు ఆయన ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ గుడుంబా తాగితే తప్పులేదు కానీ.. నేను సారా మంచిది అంటే తప్పా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో హీరోలు గ్లాసులు పట్టుకుంటే హీరోలని, రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలని ఆయన అడుగుతున్న తీరు చూస్తుంటే నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కావడం లేదు. సినిమాల్లో జరిగే ప్రతిదీ నిజ జీవితంలో అమలు చేయవచ్చని అనుకుంటే, ఇక చట్టాలు, నిబంధనలు ఎందుకు ?
సినిమా అనేది ఒక వినోదం.. అక్కడ ధరించే దుస్తుల దగ్గర నుండి చేసే పనుల వరకు అన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి. ఆ విషయం చిన్న పిల్లోడికి అడిగినా చెబుతాడు. కానీ, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి సినిమాల్లో వాటిని సాకుగా చూపిస్తూ విషపూరితమైన సారాను సమర్థించడం సిగ్గుచేటన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజలను ఆరోగ్యవంతమైన మార్గంలో నడిపించాల్సిన నాయకుడే, ఇలా సారా మంచిదని ప్రోత్సహించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తన వాదనతో నవ్వుల పాలవుతున్నానని తెలిసి, పవన్ కల్యాణ్ పేరు చెబితే తన పరువు కాపాడుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లున్నారు.
గతంలో కూడా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిరుథ్ రెడ్డికి, ఆయన అంటే ఒక ‘ సాఫ్ట్ టార్గెట్ గా కనిపిస్తున్నట్లుంది. పవన్ పేరు వాడితే వచ్చే పబ్లిసిటీ కోసం ఆయన ఇంతలా దిగజారాలా? సారా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుంటే, దానివల్ల లాభాలున్నాయని చెప్పడం మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
