కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచే పోరాటాన్ని చేయాలనుకున్నారు. ఆ పథకాన్ని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ్నుంచే ఉద్యమం ప్రారంభించాలని అనుకుంటున్నారు.
2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీలు బండపల్లి నుంచే ఈ ఉపాధి హామీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు అదే తేదీన, అదే గ్రామంలో సభ నిర్వహించడం ద్వారా ఉపాధి హామీ పథకంపై తమకున్న పేటెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకే సోనియా, రాహుల్ సహా అగ్రనేతలంతా వస్తారని ప్రచారం ప్రారంభించారు.
కానీ అనారోగ్యం కారణంగా సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. ఏ పార్టీ కార్యక్రమానికీ వెళ్లడం లేదు. కానీ రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన పర్యటనను విజయవంతం చేసే క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గతంలోనూ రాహుల్ అనంతపురం లో పర్యటించారు కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. షర్మిల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఏపీ పీసీసీ సమన్వయ కమిటీలను ఏర్పాటు జన సమీకరణపై దృష్టి పెట్టాలని అనుకుంటోంది.
ఉపాధి హామీ పథకం మార్పులపై ప్రజల్లో అసంతృప్తి ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇదో పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.లేకపోతే ఉద్యమం ప్రారంభమే ఎవరికీ పట్టనిది అవుతుంది.
