కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీ వాద్రాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బహిరంగంగానే ఆమె పేరును ప్రతిపాదించడం సంచలనంగా మారింది. పార్టీ అంతర్గత పరిణామాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. మసూద్ వ్యాఖ్యలను ప్రియాంక భర్త రాబర్ట్ కూడా సమర్థించినట్లుగా మాట్లాడారు. దీంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రారంభమయింది.
వాయనాడ్ విజయం – ప్రియాంక ఇమేజ్ మార్పు
వాయనాడ్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ప్రియాంకా గాంధీ స్టార్ క్యాంపెయినర్ స్థాయి నుండి పూర్తిస్థాయి పార్లమెంటేరియన్‌గా రూపాంతరం చెందారు. ఆమెలోని వాగ్ధాటి, ఇందిరా గాంధీని పోలి ఉండే రూపం , ప్రజల్లోకి దూసుకుపోయే నైజం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ,దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు భావిస్తున్నారు. ఆమెను పీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా బీజేపీకి బలమైన కౌంటర్ ఇవ్వవచ్చనేది వీరి వాదన.
రాహుల్ నాయకత్వ లోపం
చాలా కాలంగా రాహుల్ గాంధీ పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్నారు. భారత్ జోడో యాత్ర చేశారు. అయితే ఆయన పోరాటానికి తగ్గ ఫలితాలు రావడం లేదు. ఆయనది బలహీనమైన నాయకత్వమన్న ముద్ర పడిపోయింది. ఆయన ఎంతకూ మార్చుకోలేకపోతున్నారు. ఓటు చోరీ వంటి ప్రజల్లో స్పందన లేని విధానాలతో ఆయన తన పార్టీని చులకన చేస్తున్నారు. ీ విషయంలో రాహుల్ కంటే ప్రియాంకకు ‘స్ట్రైక్ రేట్’ ఎక్కువగా ఉంటుందనే భావన పార్టీలోని ఒక వర్గంలో ఉంది. అందుకే రాహుల్ గాంధీని ప్రియాంకకు బదులుగా ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు.
గాంధీ కుటుంబంలో చీలికలు వస్తాయా?
ప్రియాంకా గాంధీ ఎప్పుడూ పార్టీ నాయకత్వం కోసం ముందుకు రాలేదు. పార్టీకి అవసరం కాబట్టే ఆమెను బలవంతంగా రాజకీయాల్లోకి తెచ్చారు. ఇప్పుడు రాజకీయాలను ఆమె సీరియస్ గా తీసుకున్నారు. చివరికి రాహుల్ బదులు ప్రియాంకను తెరపైకి తీసుకు రావాలన్న డిమాండ్ రావడంతో కుటుంబంలో సమస్యలు వస్తాయా అన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. గాంధీ కుటుంబంలో వారసత్వ పోరు మొదలైందని, రాహుల్ విఫలం కావడం వల్లే ఇప్పుడు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
ఇండియా కూటమి నుంచి కూడా ప్రియాంకకు సపోర్టు లభిస్తుందా?
కేవలం పార్టీలోనే కాకుండా, ఇండీ కూటమిలోని మిత్రపక్షాల స్పందన కూడా ఇక్కడ కీలకం. ఇప్పటికే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి నేతలు రాహుల్ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేయడం లేదు. ఇప్పుడు ప్రియాంక పేరు రావడంతో, కూటమిలో పీఎం అభ్యర్థి ఎవరనే దానిపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇది కూటమిలో ఐక్యతకు భంగం కలిగిస్తుందా లేక కొత్త ఆశాకిరణంలా మారుతుందా అనేది కీలకం. ప్రియాంక అయితే కూటమికి మేలు జరుగుతుందనుకుంటే పార్టీలు అంగీకరించే అవకాశం ఉంది.
రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన నాయకత్వ పటిమను నిరూపించుకోవాల్సి ఉంది. రాహుల్ గాంధీ తన పట్టును నిరూపించుకోలేకపోతే, పార్టీ కేడర్ నుండి ప్రియాంక కోసం ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ “రాహుల్ నాయకత్వం – ప్రియాంక సహకారం” అనే ఫార్ములాతోనే ముందుకు సాగేలా కనిపిస్తోంది.
