తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న TTD టెక్నికల్ కమిటీలో ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ విజయ భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం సంచలనంగా మారింది. కల్తీ నెయ్యి సరఫరా చేసే డైరీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు ఆయన 82 లక్షల రూపాయలకు పైగా లంచం తీసుకున్నారనే బలమైన సాక్ష్యాధారాలను సీబీఐ నేతృత్వంలోని సిట్ ( సేకరించింది.
ముగింపు దశకు విచారణ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన విజయ భాస్కర్ రెడ్డి పాత్రపై సిట్ అధికారులు లోతైన దర్యాప్తు జరిపారు. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసే సంస్థలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా వారికి టెండర్లు దక్కేలా ఆయన చక్రం తిప్పారని దర్యాప్తులో వెల్లడైంది. దీనికోసం వివిధ డైరీల నుంచి ఆయన భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు బ్యాంక్ లావాదేవీల ద్వారా నిర్ధారణ అయింది. అరెస్ట్ భయంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది.
తిరుపతికి చేరిన సీబీఐ జేడీ
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, దర్యాప్తును వేగవంతం చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ స్వయంగా తిరుపతికి చేరుకుని, సిట్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
ముడుపుల పర్వం – సాంకేతిక ఆధారాలు
విజయ భాస్కర్ రెడ్డి కేవలం నగదు రూపంలోనే కాకుండా, తన బంధువుల అకౌంట్లలోకి కూడా లంచం సొమ్మును మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌లో ఆయన ఒక కీలక సూత్రధారిగా వ్యవహరించారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నాణ్యతా పరీక్షల్లో విఫలమైనా, లంచం తీసుకుని ఆ నెయ్యిని లోపలికి అనుమతించడంలో ఆయన పాత్రపై ఫోరెన్సిక్ , సాంకేతిక ఆధారాలు లభించాయి. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్ తిరస్కరణతో పాటు, టీటీడీకి చెందిన మరికొందరు మాజీ ఉన్నతాధికారుల అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జైల్లో ఉన్న నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సీబీఐ జేడీ రంగంలోకి దిగడంతో, ఈ స్కామ్‌లో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చివరిలో ఎవరూ ఊహించని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
