హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తులో పోలీసులు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు వరుసగా మూడోసారి తిరస్కరించింది. నిందితులపై మోపిన అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్యంత సాధారణంగా భావించే ఈ కేసులో కూడా దర్యాప్తు సంస్థ పదే పదే సాంకేతిక పొరపాట్లు చేయడం వెనుక అసలు కారణం ఏమిటనే చర్చ మొదలైంది.
అల్లు అర్జున్ పాత్రపై అస్పష్టత
ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను రెండవ నిందితుడిగా చేర్చిన పోలీసులు, ఆయన రాక వల్లే తోపులాట జరిగిందని అభియోగాలు మోపారు. ఒక రోజు అరెస్టు చూపించారు. హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే చార్జిషీటులో ఆయన పాత్రను నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. నిందితుడి ప్రమేయం వల్లనే మరణం సంభవించిందని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాల అనుసంధానంలో పోలీసులు విఫలమవుతున్నారు. స్పష్టమైన వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు అందుబాటులో ఉన్నా, వాటిని చట్టపరమైన పత్రాలుగా మార్చడంలో పోలీసులు చూపుతున్న ఉదాసీనత అనేక ప్రశ్నలకు తావిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
చిన్న కేసులో పెద్ద జాప్యం ఎందుకు?
సాధారణంగా ఇలాంటి ప్రమాద ఘటనల్లో నిర్లక్ష్యం ఎవరిదో తేల్చడం పోలీసులకు పెద్ద కష్టం కాదు. కానీ, ఈ కేసులో మాత్రం చార్జిషీటును పక్కాగా రూపొందించడంలో జాప్యం జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులోనే నిందితులపై నాన్-బెయిలబుల్ సెక్షన్లు విధించిన పోలీసులు, ఇప్పుడు కోర్టు అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉన్నందువల్లే దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారా లేదా పోలీసుల వద్ద బలమైన ఆధారాలే లేవా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
నిందితులపై మోపిన సెక్షన్లకే ఎసరు?
సెక్షన్ 106(1) వంటి తీవ్రమైన అభియోగాలు మోపినప్పుడు, పోలీసులు అంతే స్థాయి తీవ్రతతో ఆధారాలను కోర్టు ముందు ఉంచాలి. కానీ చార్జిషీటులో పేర్కొన్న అంశాలకు, అందించిన సాక్ష్యాలకు పొంతన లేకపోవడంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పదే పదే చార్జిషీటు వెనక్కి రావడం పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. తదుపరి విచారణలోనైనా పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీటును సరిచేసి దాఖలు చేస్తారా లేక కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
