తెలంగాణలో స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు లీకులు ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ వ్యవస్థల వల్ల అధికార యంత్రాంగం క్లిష్టంగా మారుతోందని, నిధుల వినియోగంలో జాప్యం జరుగుతోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మధ్యంతర వ్యవస్థలను తొలగించి, గ్రామ పంచాయతీ సర్పంచులకు , జిల్లా స్థాయి యంత్రాంగానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. .
పరిషత్‌లకు చాలా స్వల్పంగానే నిధులు
ప్రస్తుతం మండల పరిషత్ , జిల్లా పరిషత్ సభ్యులకు కేటాయించే నిధులు చాలా పరిమితంగా ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో ఎంపీటీసీలకు కనీస అధికారాలు కూడా ఉండటం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. ఈ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా పాలనాపరమైన ఖర్చులను తగ్గించడమే కాకుండా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మండల వ్యవస్థను కేవలం పరిపాలనా విభాగంగానే ఉంచి, రాజకీయ ప్రాతినిధ్యాన్ని గ్రామ, జిల్లా స్థాయిలకే పరిమితం చేయడం ద్వారా ద్వంద్వ పాలన కు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే సాధ్యం కాదు !
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయడం అంత సులభమైన విషయం కాదు. భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలు అమలులో ఉండాలి. దీనిని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంటు ఆమోదం కూడా అవసరమవుతుంది. కేవలం రాష్ట్ర స్థాయి నిర్ణయంతో రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలను రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొగ్గు చూపితే, దీనిపై సుదీర్ఘమైన న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉంది.
కలసి వచ్చే పార్టీలు ఉండవు
పరిషత్‌ల రద్దు ప్రతిపాదనపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనుకునే నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా విపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ ఆలోచన చర్చకు కారణం అవుతుంది కానీ అమల్లోకి రాకపోవచ్చు
