దశాబ్దాల కాలంగా నాస్తికవాదాన్ని, మార్క్సిస్ట్ సిద్ధాంతాలను నమ్మి, దేవుడి ఉనికిని ప్రశ్నించిన కమ్యూనిస్ట్ దిగ్గజం, సీపీఐ అగ్రనేత నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడూ ఎర్రజెండా నీడన ఉంటూ, హేతువాద దృక్పథంతో మాట్లాడే నారాయణ.. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి చెంతన కనిపించారు. పైగా లడ్డూ వివాదంపై భక్తితో స్పందించారు. లడ్డూ కల్తీ జరిగిందనేది నిజమని కానీ రాజకీయంగా ప్రచారం చేసి వాడుకోవడం కన్నా చర్యలు తీసుకోవాలన్నారు.
సాధారణంగా కమ్యూనిస్టులు మతం ఒక మత్తుమందు అన్న కార్ల్ మార్క్స్ మాటలను విశ్వసిస్తారు. గతంలో నారాయణ ఎన్నోసార్లు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండపైకి వచ్చినప్పటికీ, వారు దర్శనం చేసుకునే సమయంలో ఆయన బయటే వేచి ఉండేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా, స్వయంగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం చర్చకు దారితీసింది. వయసయిపోతున్న సమయంలో ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చి.. ? లేక దైవం పట్ల సానుకూలత పెరిగినట్లుగా కనిపిస్తోంది.
ఒక కరడుగట్టిన కమ్యూనిస్టు నాయకుడు ఇలా ఆధ్యాత్మిక బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. దేవుడు లేడు అని బలంగా వాదించే సిద్ధాంతం నుంచి, నేరుగా ఆలయ గర్భాలయం వరకు ఆయన ప్రయాణం వెనుక అభిప్రాయ మార్పు ఉందని అనుకోవచ్చు.
