స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరి తొందరపడాలనుకోవడం లేదు. మరింత గడువు కావాలని వారు వేర్వేరుగా స్పీకర్ ను కోరుతూ లేఖలు పంపారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఈ సమాధానం ఇచ్చారు. ఎంత గడువు అన్నది బహుశా వారికి కూడా తెలిసి ఉండదు. మిగతా ఎనిమిది మంది విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ స్పష్టత ఉంది. స్పీకర్కూ ఉంది. అందరి పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను తిరస్కరిస్తారు. కానీ వీరిద్దరిపై మాత్రం తిరస్కరించలేరు. అందుకే వారితో కలపకుండా.. వీరిద్దరి విషయంలో వ్యూహం పాటిస్తున్నారు.
కడియం శ్రీహరి కుమార్తె ఎంపీ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. కానీ కడియం శ్రీహరి తాను కూడా. పార్టీ మారలేదని చెప్పుకోవడానికి చాన్స్ ఉంది.కానీ అలా చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాననే చెబుతున్నారు. ఉపఎన్నికలకూ సిద్ధమేనని.. ఉపఎన్నికలు వస్తే తానే పోటీ చేస్తానంటున్నారు. కానీ తాను పార్టీ మారిపోయానని మాత్రం స్పీకర్ కు చెప్పడం లేదు. రేవంత్ వ్యూహం ప్రకారం అయన సమాధానం ఇవ్వనున్నారు. ఇక దానం నాగేందర్ విషయంలోనూ అంతే. ఆయన సమయం అడుగుతున్నారు కానీ.. తాను పార్టీ మారలేదని చెప్పలేకపోతున్నారు. చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రికార్డు ఉంది.
స్పీకర్ కూడా పదిమందిలో ఎనిమిది మంది నిర్ణయాలు తీసుకుని వీరిద్దరి విషయం మాత్రం పెండింగ్ పెట్టే అవకాశం ఉంది. స్పీకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ గవాయ్ పదవి విరమణ చేస్తున్నారు. నాలుగు వారాల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ కొత్త చీఫ్ జస్టిస్ బెంచ్ వద్దకు వెళ్తుంది. అప్పుడు ఎలా స్పందిస్తారన్నదానిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తదుపరి వ్యూహం పాటించే అవకాశం ఉంది.