వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపం.. తాను కోర్టు కేసులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా.. కోర్టు ఆవరణలో న్యాయమూర్తి పిలుపు కోసం నిరీక్షించవలసిన గంటల కొద్దీ సమయాన్ని కూడా పార్టీని కాపాడుకోవడం కోసం వెచ్చిస్తూ.. ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే.. ఆ కష్టమేమీ ఫలితం ఇచ్చినట్లుగా లేదు. రెండురోజుల కిందట నాంపల్లి కోర్టు వద్దకు వచ్చి జగన్‌తో భేటీ అయి.. ఆయన అందించిన ‘ధైర్యం’ పుచ్చుకుని వెళ్లిన ఎమ్మెల్యే ఒకరు తెలుగుదేశంలో చేరిపోతున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలనికి చెందిన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు.. విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి కొద్దిసేపట్లో ఆయన పనసుపు కండువా కప్పుకోనున్నారు.
ప్రకాశం జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపా వైపు చూస్తున్నారనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. అయితే.. ఈ పుకార్లతో అలర్ట్ అయిన వైకాపా నాయకులు ముందుగానే తమ ఎమ్మెల్యేలను పోగేసి.. వారితో చంద్రబాబును తిట్టిస్తూ స్టేట్మెంట్లు ఇప్పించి.. తామెవ్వరూ పార్టీ వీడడం లేదనే ప్రకటనలు చేయించారు. చంద్రబాబు మైండ్ గేం ఆడుతున్నాడంటూ వారితో ప్రచారం చేయించారు.
ఆ తర్వాత విడతలుగా అనుమానం ఉన్న అందరు ఎమ్మెల్యేలతోనూ జగన్ వరుసగా భేటీలు అవుతూనే ఉన్నారు. ఆ మేరకు శుక్రవారం నాడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యే పని వెంటనే అయిపోతుందనుకున్నారేమో జగన్ మూడునాలుగు జిల్లాల ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకున్నారు. కోర్టులో నిరీక్షణ సమయం పెరిగిపోయింది. దీంతో ప్రకాశం జిల్లాకుచెందిన ఎమ్మెల్యేలను జగన్‌తో భేటీ వేయించడానికి ఆయన మామ వరు అయ్యే మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టు వద్దకే తీసుకు వచ్చారు. అక్కడ డేవిడ్‌రాజు తదితరులు జగన్‌తో భేటీ అయి వెళ్లారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం నూరిపోస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
అయితే అక్కడినుంచి వెళ్తూ.. మీడియా అడిగినప్పుడు డేవిడ్‌రాజు చాలా చిత్రమైన జవాబు చెప్పారు.. ‘మా నాయకుడు చెప్తున్నాడు గదా.. అంతే.. అలాగే జరుగుతుంది’ అంటూ నర్మగర్భంగా సెలవిచ్చారు. తీరా శనివారం ఒక్కరోజు గడిచేసరికి ఆదివారం పొద్దున్నే ఆయన చంద్రబాబుతో భేటీ కావడం విశేషం.
డేవిడ్‌రాజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరితో.. వైఎస్సార్ కాంగ్రెస్‌నుంచి వెళ్లిన వారి సంఖ్య 6కు చేరుతుంది. మరో నాలుగైదురోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు చేరడానికి కూడా రంగం సిద్ధమవుతున్నదని తెలుస్తోంది.