సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తున్న తీరు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే, భట్టి విక్రమార్క మాత్రం దీనిని ఉద్యోగుల ఆత్మస్థైర్యానికి ముడిపెడుతూ స్పందిస్తున్నారు. టెండర్ల కేటాయింపు అనేది పూర్తిగా విధానపరమైన , పరిపాలనాపరమైన నిర్ణయం. ఒకవేళ అందులో అక్రమాలు జరిగితే దానికి ప్రభుత్వ పెద్దలు లేదా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలి తప్ప, కార్మికులను లేదా ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయడం ఎందుకో పెద్దలకే తెలియాలి.
టెండర్లకు సంబంధించిన నిబంధనలు ఎప్పుడో మార్చేశారని, ప్రస్తుత ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదని డిప్యూటీ సీఎం వాదిస్తున్నారు. అదే నిజమైతే, జరుగుతున్న విచారణలో ఆ విషయాలు ఎలాగూ బయటపడతాయి. వాస్తవాలు నిగ్గుతేలే వరకు వేచి చూడకుండా, ప్రతి విమర్శకు ఉద్యోగుల మనోధైర్యాన్ని సాకుగా చూపడం రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోంది. అక్రమాలపై విచారణ జరిపించడమంటే అది సంస్థను అప్రతిష్ఠ పాలు చేయడం కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే. కానీ ప్రభుత్వం మాత్రం విమర్శలను తప్పుదోవ పట్టించేలా ఉద్యోగుల మనోభావాలను అడ్డుపెట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ సంస్థలలో పారదర్శకత పెంచడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ ఉద్యోగుల సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం పాలనాపరమైన అపరిపక్వతకు సంకేతంగా మారుతోంది. సింగరేణి వంటి కీలక సంస్థల మనుగడకు పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ అత్యంత ముఖ్యం. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో కార్మికులను రక్షణగా వాడుకోకుండా, ప్రభుత్వం తన విధానాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగుల ఆత్మస్థైర్యం పేరుతో అసలు సమస్యను పక్కదారి పట్టించడం వల్ల జరగాల్సిన నష్టం జరగడమే కాకుండా, ప్రభుత్వ చిత్తశుద్ధిపై కూడా అనుమానాలు కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
