‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఆదివారం రెండో పాట విడుదలైంది. ‘మెడ ముట్టుకొంటే, తొడ కొట్టినట్టే’ అంటూ సాగిన ఈ పాట పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉంది. కాకపోతే తొలి పాటలా.. యునానిమస్ హిట్ కాదు. ఈ పాటకు సంబంధించి ఆల్రెడీ డిబేట్ మొదలైపోయింది. పాట బాగుందంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకొంటుంటే.. ‘తొడ – మెడ’ ఈ టైటింగ్ ఏమిటి? ఆరైమింగ్ ఏమిటి? అంటూ నిష్టూరాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దేవిశ్రీ మ్యాజిక్ ఈసారి వినిపించలేదని, ఇంత కంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోని టైటిల్ గీతమే వెయ్యి రెట్లు బెటర్ అనే అభిప్రాయాలు కూడా బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇది పొలిటికల్ పార్టీ గీతంలా ఉందని సెటైర్లు వేసేవాళ్లూ ఉన్నారు.
చంద్రబోస్ సాహిత్యానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. పాటని ఎంజాయ్ చేస్తున్నవాళ్లు కూడా ‘చంద్రబోస్ ఇంతకంటే బాగా రాయగలరు కదా’ అనే అంటున్నారు. వాళ్ల మాటల్లోనూ ఎంతో కొంత నిజం కనిపిస్తోంది. ఈపాటని ఇంకాస్త పదునైన భావాలతో రాయాల్సింది. జనసేన పార్టీ ప్రచారం కోసం అప్పట్లో కొన్ని పాటలు రూపొందించారు. ఆ పాటలే ఇంకా బాగున్నాయని కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈపాట విజువల్స్‌కి, పాత పాటలు మిక్స్ చేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు. ‘ఓజీ’లో పాటలు కొత్త సౌండింగ్ తో అలరించాయి. స్టైలీష్గానూ కుదిరాయి. పవన్ సినిమాల్లో ‘ఓజీ’ సంగీతం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఆ పాటలు విని ఇప్పుడు ‘తొడ – మెడ’ రైమింగ్ పాటలు వినాలంటే కొంత ఇబ్బందే అని చెప్పొచ్చు.
కాకపోతే ఒకటి.. పాటైనా.. సినిమా అయినా.. ఇలా వచ్చి, అలా వెళ్లిపోకూడదు. కాస్తో కూస్తో దానిపై డిబేట్ జరగాలి. అలా జరిగిందంటే విషయం ఉన్నట్టే లెక్క. ఆ లెక్కన ‘ఉస్తాద్’ పాటలోనూ విషయం ఉందనే అనుకోవాలి. ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ రెండు పాటలు వచ్చాయి. మరి మిగిలిన రెండు పాటలూ ఎలా ఉంటాయో చూడాలి.
