ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులందరికీ ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. గత నెలలో రౌస్ అవెన్యూ కోర్టు వీరందరినీ డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ తీర్పుపై హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించనప్పటికీ, సీబీఐ అభ్యర్థన మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు సంస్థపై , దర్యాప్తు అధికారిపై దిగువ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే, ఈ సీబీఐ కేసు ఆధారంగా నడుస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయాలని దిగువ కోర్టును ఆదేశించింది. ఈ పరిణామం దర్యాప్తు సంస్థలకు కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.
లీగల్ ప్రొసీజర్‌లో భాగంగా నోటీసులు జారీ కావడం సహజమని, తమ క్లయింట్లపై ఉన్న ఆరోపణలు ఇప్పటికే దిగువ కోర్టులో వీగిపోయాయని నిందితుల తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, ట్రయల్ నిర్వహించకుండానే నిందితులను వదిలేయడం సరికాదని సీబీఐ వాదిస్తోంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.