ఢిల్లీ మద్యం విధానం కేసులో నిందితులందరినీ విముక్తి చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు వ్యవస్థలోని కొన్ని క్లిష్టమైన ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట, పౌర స్వేచ్ఛ , దర్యాప్తు సంస్థల బాధ్యతాయుత తీరు ఇక్కడ చర్చకు వస్తోంది.
మనీలాండరింగ్ కేసుల వల్లే ఎక్కువ రోజులు జైల్లో
దర్యాప్తు సంస్థలు సమర్పించిన వేల పేజీల సాక్ష్యాల్లో నేరాన్ని నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పడం, మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి కీలక నేతలు నెలల తరబడి జైలు శిక్ష అనుభవించడం వెనుక ఉన్న ప్రధాన కారణం మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని కఠినమైన నిబంధనలు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, వారు నిర్దోషులని నిరూపించుకునే భారం నిందితులపైనే ఉంటుంది. దీనివల్ల విచారణ పూర్తికాకముందే శిక్ష గా పరిణమించే సుదీర్ఘ జైలు జీవితాన్ని వారు గడపాల్సి వచ్చింది.
పోయిన ప్రతిష్ట, గౌరవం …కేసు కొట్టివేతతో వస్తుందా?
రాజకీయ నాయకులకు వారి ప్రతిష్టే అసలైన ఆస్తి. ఈ కేసు కారణంగా వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ గౌరవం ,రాజకీయ భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు కోల్పోయిన కాలాన్ని, అనుభవించిన మానసిక వేదనను ఏ పరిహారం భర్తీ చేయలేదు. ప్రజల దృష్టిలో ఒకసారి నిందితులు గా ముద్ర పడిన తర్వాత, కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా ఆ ముద్రను చెరిపివేయడం అసాధ్యం. ఇది కేవలం వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు, వారు ప్రాతినిధ్యం వహించే పార్టీల మనుగడపై కూడా పెద్ద దెబ్బ.
తప్పు చేయకుండా జైలు శిక్ష అనుభవించినట్లే కదా !
దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నాయనే విమర్శలకు ఈ తీర్పు మరింత బలాన్ని చేకూర్చింది. తగిన సాక్ష్యాలు లేకుండా అభియోగాలు మోపడం, కోర్టులో నిలబడని వాదనలు వినిపించడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. ఒకవేళ విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టినట్లు తేలితే, వారిపై చర్యలు తీసుకునే బలమైన చట్టాలు మన దగ్గర లేవు. తప్పుడు కేసుల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం లేదా దర్యాప్తు సంస్థల నుండి పరిహారం అందేలా దురుద్దేశపూర్వక విచారణ కింద కఠిన నిబంధనలు రావాల్సిన అవసరం ఉంది.
తప్పుడు కేసులు పెట్టిన వారిని జవాబుదారీ చేయాల్సిందే!
కోల్పోయిన ప్రతిష్టకు న్యాయం జరగాలంటే వారు నిర్దోషులని ప్రకటిస్తే సరిపోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛ ను హరించినందుకు బాధ్యులైన వారిని జవాబుదారీలను చేయాలి. విచారణ పేరుతో ఏళ్ల తరబడి జైల్లో ఉంచి, చివరికి సాక్ష్యాలు లేవని వదిలేయడం వ్యవస్థలోని వైఫల్యంగానే పరిగణించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, దర్యాప్తు సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడటంతో పాటు, తప్పుడు కేసుల విషయంలో పరిహారం చెల్లించే వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
