ఈమధ్య రిలీజ్‌ల కంటే రీ రిలీజ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయితే.. ఫ్యాన్స్ కూడా థియేటర్లకు పోటెత్తుతున్నారు. వసూళ్లూ బాగానే వస్తున్నాయి. దాంతో ఈ పోకడ మరింత ఎక్కువ అవుతోంది. రీ రిలీజ్ లో కూడా కొన్ని మార్పులూ చేర్పులూ జరుగుతున్నాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని త్రీడీ వెర్షన్లో రిలీజ్ చేశారు. ‘లక్ష్మీ నరసింహా’ రీ రిలీజ్ లో అయితే ఓ పాట కొత్తగా జోడించారు. ఇప్పుడు ధనుష్ సినిమా కోసం అయితే ఏకంగాట క్లైమాక్స్ నే మార్చి రిలీజ్ చేశారు.
ధనుష్ హీరోగా నటించిన సినిమా.. ‘రాంఝానా’. సోనమ్ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేశారు. అయితే పాత క్లైమాక్స్ స్థానంలో మరో క్లైమాక్స్ జోడించారు. అది కూడా ఏఐ సహాయంతో. దాంతో ధనుష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సినిమాల్లో కంటెంట్ ని మార్చడానికి ఏఐని ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ కూడా చేశాడు. భవిష్యత్తులో కళాకారులకు ఇది ఇబ్బంది కలిగించే అంశమని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పోకడ చాలా ప్రమాదకరమని, ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో నిబంధనల్ని కఠినతరం చేయాలని కోరాడు.
ఏఐ టూల్ ప్రపంచాన్ని శాశించే స్థితికి చేరుకొంటోంది. ముఖ్యంగా సినిమాలో చొరబడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏఐతో ఏకంగా సినిమాలే తీసేస్తున్నారు. క్లైమాక్స్‌ని మార్చడం పెద్ద విషయం ఏమీ కాదు. మారుతున్న సాంకేతికతని అందిపుచ్చుకోవాల్సిందే. కాకపోతే.. కళకి, కళాకారులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. ‘రాంఝానా’ క్లైమాక్స్ మార్చడం, అందుకోసం ఏఐని ఆసరాగా తీసుకోవడం రీ రిలీజ్ ట్రెండ్ ని మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గనుక క్లిక్ అయితే.. రాబోయే రీ రిలీజ్లు మరింత ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. దాంతో పాటు ధనుష్‌లాంటి రూపకర్తలకు సరికొత్త అనుమానాలకు, అభద్రతా భావానికి గురి చేయడం కూడా సహజమే. దీనిపై చిత్రసీమ ఎలా స్పందిస్తుందో, ధనుష్ కు ఏమేరకు బాసటగా నిలుస్తుందో చూడాలి.