జనసేన పార్టీ మద్దతు కోసం పోటీ పడతారు.. అంతా అయిపోయాక. మాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదని ప్రకటనలు చేస్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాగుతున్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..జనసేనతో ఆంధ్రాలో పొత్తు ఉంది, తెలంగాణలో లేదు అంటూ వ్యాఖ్యానించారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని.. జనసేనతో ఏపీలోనే పొత్తు ఉందన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ వస్తాడా అని సెటైర్ వేశారు.
తెలంగాణలో జనసేన అభ్యర్థులు మూడు వందలకుపైగా వార్డుల్లో పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కిషన్ రెడ్డి స్వయంగా పవన్ కల్యాణ్ ను అర్థరాత్రి వరకూ వెయిట్ చేసి మరీ కలిశారు. మద్దతు ఇచ్చేలా ఒప్పించారు. పవన్ కూడా అంగీకరించారు. రెండు రోజుల పాటు ప్రచారం చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ప్రచారం రద్దు అయింది. ఇలా వెళ్లి పవన్ కల్యాణ్ ను రామచంద్రరావు, కిషన్ రెడ్డి కలిసినప్పుడే.. పవన్ ప్రచారం అవసరం లేదని.. ధర్మపురి అర్వింద్ చెప్పి ఉంటే కాస్త పద్దతిగా ఉండేది.
ఎన్నికలు జరిగిపోయాక.. పవన్ రావాల్సిన అవసరం లేదు… ఆయన మద్దతు అవసరం లేదు అని ప్రకటనలు చేయడం తాము మద్దతు అడిగిన పార్టీ నాయకుడ్ని కించపర్చడం కాదు.. తమ వ్యక్తిత్వాన్ని చిన్న బుచ్చుకోవడమే. పవన్ కు బలం లేకపోతే.. ఎందుకు వెళ్లి అడిగినట్లు అన్నది ఆలోచించుకోవాలి. గతంలో గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పోటీ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడూ అదే చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు .. అహంకారం వదిలి మిత్రపక్షాల పట్ల గౌరవం చూపడం నేర్చుకోవాల్సి ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.