దురంధర్ సినిమా విడుదల తర్వాత పాకిస్థాన్‌లో ఎవరికీ కంటి మీద కనుకు ఉండటం లేదు. ఎవరు ఎవర్ని చూసినా ఇండియన్ ఏజెంటేమో అనుకంటున్నారు. ఈ కారణంగా పాకిస్థాన్ సమాజంలో ప్రస్తుతం ఒక వింతైన అభద్రతా భావం అలుముకుంది. దురంధర్ సినిమా చూశాక పాకిస్థాన్‌లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం.. ఎవరితో మాట్లాడినా వారు ఇండియన్ ఏజెంట్లు ఏమో అన్న భయం వేస్తోంది అని ప్రముఖులు కూడా చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు ఆ దేశంలో భారత్ పట్ల ఉన్న ఫోబియా ఏ స్థాయిలో ఉందో చూపిస్తున్నాయి. రోడ్డు పక్కన అడుక్కునే బిచ్చగాడి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరినీ విచారించాలనే డిమాండ్ రావడం అక్కడి గందరగోళానికి అద్దం పడుతోంది.
ఎవర్ని చూసినా భారత ఏజెంట్స్ అని భయం భయం
ఈ భయానికి ప్రధాన కారణం దురంధర్ సినిమాలో చూపించిన గూఢచారి నెట్వర్క్. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఏ స్థాయిలో చొచ్చుకుపోయింది, దశాబ్దాల తరబడి పాకిస్థానీయులుగా చలామణి అవుతున్న వారు కూడా భారత ఏజెంట్లుగా ఎలా పని చేస్తున్నారనే అంశాలను ఈ సినిమా కళ్లకు కట్టింది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయ నేతలు, సైనిక వర్గాల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతోంది. తమ మధ్యే ఉంటూ తమ రహస్యాలను భారత్‌కు చేరవేస్తున్న ఇన్సైడర్స్ ఎవరా అని వెతుక్కునే పనిలో పడ్డారు.
రాజకీయంగానూ కలకలం
రాజకీయంగా కూడా ఈ సినిమా పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు, ప్రభుత్వ అనుకూల వర్గాలు ఒకరినొకరు ఇండియన్ ఏజెంట్లుగా ముద్ర వేసుకునే సంస్కృతి అక్కడ పెచ్చుమీరింది. ఒకప్పుడు కేవలం యుద్ధాలకే పరిమితమైన భారత్-పాక్ వైరం, ఇప్పుడు సైకలాజికల్ వార్‌గా మారింది. భారత్ తన గూఢచారి వ్యవస్థ ద్వారా పాకిస్థాన్‌ను లోపల నుండే బలహీనపరుస్తోందనే భయం, అక్కడి పాలకులను నిద్రపోనివ్వడం లేదు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ విచారించాలి అనే ఆలోచన పాకిస్థాన్ నిఘా విభాగాలకు ఒక సవాలుగా మారింది.
అనుమానం పెనుభూతం అయితే అరాచకమే
ఒక సినిమా పాకిస్థాన్ వంటి దేశంలో ఇంతటి అలజడి రేపడం చిన్న విషయం కాదు. నిజానికి ఈ సినిమాను పాక్ లో బ్యాన్ చేసారు. కానీ వివిధ మార్గాల్లో చూడని వారు లేరు. ఇది కేవలం సినిమా ప్రభావమే కాకుండా, క్షేత్రస్థాయిలో భారత్ సాధిస్తున్న దౌత్య , వ్యూహాత్మక విజయాల పట్ల పాకిస్థాన్‌లో నెలకొన్న అసహనానికి సంకేతం. ఎవరిని చూసినా భారతీయుడిలా కనిపిస్తున్నారనే ఆందోళనలో పాకిస్థాన్ ఉందంటే, అది భారత నిఘా వ్యవస్థ సాధించిన మానసిక విజయంగానే పరిగణించాలి. ఈ అనుమానం పెనుభూతంగా మారితే పాకిస్తాన్ లో వ్యవస్థలన్నీ ఘర్షణలకు దిగాల్సిందే.


