నయనతార రూటే సెపరేటు. అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయికల్లో తానొకరు. పైగా ఓ సినిమా ఒప్పుకొనే ముందు సవాలక్ష కండీషన్లు పెడుతుంటారు. ముఖ్యంగా ప్రమోషన్లకు ససేమీరా అంటారు. ఓ సినిమా ప్రమోషన్లలో నయనతార పాల్గొనడం చాలా చాలా అరుదు. అయితే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కోసం మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మ్యాజిక్ చేశారు. ఎప్పుడూ ప్రమోషన్లకు రాని నయనతో.. రెండు స్కిట్లు చేయించి, వీడియో రూపంలో వదిలాడు. అవన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి సైతం నయనతార వస్తుందనుకొన్నారు. కానీ తను విదేశాల్లో ఉండడం వల్ల వీలు కాలేదు. నయనతార ఈ వీడియో స్కిట్లు చేయడం వెనుక ఓ లాజిక్ ఉందని, పారితోషికంతో పాటు ఎగస్ట్రాగా కొంత మొత్తం ముట్ట చెప్పడం వల్ల, ప్రమోషన్లకు కూడా సెపరేటు పారితోషికం ఇవ్వడం వల్ల.. నయన ప్రమోషన్ వీడియోలు చేసిందన్నప్రచారం జరిగింది.దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ‘ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా నయనతారకు పారితోషికం ఇవ్వలేదని’ క్లారిటీ ఇచ్చారు.
”నయనతారకు ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా ఏం ఇవ్వలేదు.. కథకుకనెక్ట్ అవ్వడం వల్లే, ఆమె ప్రమోషన్లలోనూ పాలు పంచుకొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రావాల్సింది.కానీ.. ఆ సమయంలో ఆమె విదేశాల్లో ఉండడం వల్ల కుదర్లేదు..” అని తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో నయన తారకు ‘శశిరేఖ’ అనే పేరు పెట్టారు. ఈ పేరు వెనుక కూడా ఓ చిన్న కథ వుంది. ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ సినిమాలో విజయశాంతి పేరుకూడా శశిరేఖనే. ఆ సినిమాలో శశిరేఖ అనేపేరుని చిరు భలే గమ్మత్తుగా పలుకుతుంటారు. అది బాగా నచ్చి, ఈ సినిమాలో కథానాయికకు ఆ పేరు పెట్టారు. ‘చంటబ్బాయ్’ సినిమాలో హీరోయిన్ పేరుజ్వాల. ఆ పేరు.. ఈ సినిమాలో కేథరిన్ కి వాడారు. అలా.. చిరు పాత సినిమాలోని హీరోయిన్ల పేర్లుని వాడుకొన్నారు అనిల్ రావిపూడి.
