ఆరెస్సెస్‌ను రాహుల్ గాంధీ ఎంతగా వ్యతిరేకిస్తారో కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు. డిగ్గీరాజాగా పేరు తెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్‌కూ తెలుసు. అయినా సరే ఆయన ఆరెస్సెస్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. దాన్ని రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు.
క్వోరా సైట్లో తనకు ఒక ఫోటో కనిపించిందని చెబుతూ ఆ ఫోటో ఆధారంగా ఆరెస్సెస్‌ను పొగిడారు. 1990లలో తీసిన ఆ ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఒక వేదికపై కూర్చుని ఉండగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒక సాధారణ కార్యకర్తలా కింద నేలపై కూర్చుని ఉన్నారు. సాధారణ ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా, జనసంఘ్ కార్యకర్తగా నాయకుల పాదాల చెంత నేలపై కూర్చున్న వ్యక్తులు.. నేడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగారు. ఇది ఆ సంస్థకు ఉన్న శక్తి అని చెప్పుకొచ్చారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కేవలం బీజేపీని పొగడటమే కాకుండా కాంగ్రెస్‌కు ఒక పరోక్ష హెచ్చరికగా చెబుతున్నారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలరనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. నాయకుల పట్ల కార్యకర్తలు చూపే వినయం, క్రమశిక్షణే ఆ పార్టీ విజయ రహస్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో అంతర్గత విబేధాలు, నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ప్రత్యర్థి పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది.
ఈ ట్వీట్ వైరల్ కావడంతో తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తాను ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకినని ఆయన ప్రకటించారు . కానీ ఆయన జై సియారామ్ అంటూ నినాదం ఇవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది.
