కొన్ని అపజయాలు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిస్తాయి. ఏది మంచో ఏది చెడో చూపిస్తాయి. కెరీర్‌కి కొత్త దారి చూపిస్తాయి. దర్శకుడు పి. మహేష్ బాబు కెరీర్లో కూడా అలాంటి ఓ అపజయం ఉంది. ‘రారా కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు మహేష్. సందీప్ కిషన్ హీరోగా 2014లో వచ్చిన సినిమా అది. ఫ్లాప్ అయ్యింది.
నిజానికి ఆ సినిమా కథ మహేష్‌ది కాదు. “A Life Less Ordinary” సినిమా ఆధారంగా రాసుకున్న కథ. స్లమ్‌డాగ్ మిలియనీర్ దర్శకుడు డానీ బాయిల్ తీసిన ఆ సినిమా అక్కడే సరిగ్గా ఆడలేదు. అలాంటి కథనిని తన తొలి సినిమాగా ఎంచుకున్నాడు మహేష్. సినిమా సరిగ్గా రాలేదు. ఆ ఫ్లాప్ తర్వాత మహేష్‌కి సినిమా రావడానికి పదేళ్ళు పట్టేసింది.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మళ్లీ లైమ్ లైట్‌కి వచ్చాడు. ఇప్పుడు రామ్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘రారా కృష్ణయ్య’ టాపిక్ వచ్చింది. “మెచ్యూరిటీ లేని వయసులో తీసిన సినిమా అది. ఏదోలా డైరెక్టర్ అయిపోవాలనే తపనతో చేసిన సినిమా. ఆ సినిమా నాకు చాలా నేర్పింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఇచ్చింది” అన్నాడు.
‘ఆంధ్ర కింగ్’ 27న వస్తోంది. ఈ సినిమా ఫలితం మహేష్‌కి చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితే మహేష్ నెక్స్ట్ లీగ్‌లోకి వెళ్తాడు. ఒక అభిమాని బయోపిక్‌గా ఈ సినిమాను తీశాడు. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై టీం అందరూ నమ్మకంగా ఉన్నారు.