రీషూట్లు చేశామ‌ని ఒప్పుకున్నాడు : ద‌టీజ్ తేజ‌..

గొప్ప సినిమా తీశాం… సూప‌ర్ హిట్ సినిమా చేశాం… అని విడుద‌ల‌కు ముందు డ‌బ్బాలు కొట్టుకుంటారు ద‌ర్శ‌కులు. కానీ `సినిమా తీశాం… బాగుందో బాలేదో మాకే తెలీదు.. మీరే చెప్పాలి` అని ఆ బాధ్య‌త నిజాయ‌తీగా ప్రేక్ష‌కుల‌కే వ‌దిలేయ‌డం తేజ‌కి మాత్ర‌మే సాధ్య‌మైందేమో. `సీత‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో తేజ మాట‌ల్ని చూస్తే ముచ్చ‌టేస్తుంది. త‌న సినిమా గురించి గొప్ప‌గా చెప్పుకోలేదు. త‌ను మేధావి కాన‌ని, త‌ప్పులు చేస్తుంటాన‌ని నిజాయ‌తీగా మాట్లాడాడు. రీషూట్లు చేశామ‌ని నిజాయితీగా చెప్పాడు.

సీత సినిమా షూటింగ్ పూర్త‌య్యాక.. మొత్తం ఫుటేజీని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌కి చూపించారు. వాళ్లు చెప్పిన మార్పులూ చేర్పులూ గ‌మ‌నించి – కొన్ని సీన్లు తొల‌గించి, కొత్త సీన్లు జోడించారు. ఈ విష‌యాన్ని తేజ మీడియా స‌మ‌క్షంలో ఒప్పుకున్నాడు. ఇప్ప‌టికీ త‌న సినిమాలో త‌ప్పుల్ని వెదుకుతున్నాన‌ని 90 శాతం సినిమా బాగొచ్చింద‌ని చెప్పుకొచ్చాడు తేజ‌.

”నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా. 90శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా అంతా తీసేసి పరుచూసి బ్రదర్స్‌ను పిలిచి చూడమన్నాను. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరిచేశా. ఎందుకంటే నాది అంత ఇంటలిజెంట్ బ్రెయిన్ ఏం కాదు.. కళ్లజోడు పెట్టుకుని ఏదో అలా కనిపిస్తా కానీ, యావరేజ్ బ్రెయిన్ నాది. చూసేవాళ్లు ఏమనుకుంటారంటే..కళ్లజోడు చూడగానే మేధావని అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే” అని చెప్పుకొచ్చాడు తేజ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com