అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఎథిక్స్ కమిటీ ఏపీ అసెంబ్లీలో సమావేశం అయింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వారు సభకు రావడం లేదు. కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. స్పీకర్ కూడా గతంలో ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే జీతాలు తీసుకోవడం లేదు. మిగతా పది మంది తీసుకుంటున్నారు.
అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు ఉండే సహజసిద్ధమైన అరవై రోజుల రక్షణ కూడా వచ్చే శీతాకాల సమావేశాలతో ముగిసిపోతుంది. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత అరవై పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే.. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేసేందుకు అవకాశం ఉంది. స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఆ గడువు కూడా వచ్చే సమావేశాలతో ముగిసిపోతుంది. అలాగే నైతికతకు విరుద్ధంగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఏ చర్యలు తీసుకోకుండా ఉంటే దమ్ముంటే అనర్హతా వేటు వేయండి అని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలా డిమాండ్ చేయక ముందే వారి కోరిక తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కారణంతోనే ఆలస్యం అయితే టీడీపీ భయపడుతోందని అనుకుంటారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండటం, ఎమ్మెల్యేలు సభకు వెళ్లకపోవడంపై ప్రజలు సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూండటంతో.. అనర్హతా వేటు సరైన వ్యూహమని టీడీపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
