తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న శాసనసభ ఎన్నికల కోసం అధికార డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నట్లు దివంగత విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అధికారికంగా ప్రకటించారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అరివాలయం లో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో గురువారం భేటీ అయిన ఆమె, ఈ మేరకు పొత్తు ఒప్పందాన్ని ఖరారు చేశారు.
పార్టీ స్థాపించిన తర్వాత డీఎంకేతో డీఎండీకే జట్టు కట్టడం ఇదే తొలిసారి. గతంలో అన్నాడీఎంకేతో ఓ సారి పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సాధించారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనేది తమ పార్టీ కేడర్ అభీష్టమని, వారి నిర్ణయమే తన నిర్ణయమని విజయ్ కాంత్ సతీమణి.. ప్రస్తుతం పార్టీని నడుపుతున్న ప్రేమలత స్పష్టం చేశారు. 2011 నుండి అన్నాడీఎంకేతో కలిసి ప్రయాణించినప్పటికీ, ఈసారి మాత్రం డీఎంకే వైపే మొగ్గు చూపినట్లు తెలిపారు. గతంలో తమ నాయకుడు విజయకాంత్ , దివంగత కరుణానిధి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని, ఈ కూటమి ఏర్పాటుతో కెప్టెన్ కోరిక నెరవేరిందని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు తమ పార్టీలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ డీఎంకే ప్రతినిధులతో చర్చించి స్థానాల సంఖ్యను ఖరారు చేస్తుందని వెల్లడించారు. తమ పార్టీ హక్కుల గురించి ఇప్పటికే స్టాలిన్‌తో ప్రాథమికంగా మాట్లాడామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తన ఆప్తమిత్రుడు విజయకాంత్ స్థాపించిన పార్టీ, ‘ద్రవిడ మోడల్’ పాలనను కొనసాగించేందుకు తమతో చేరడం సంతోషకరమని స్టాలిన్ ప్రకటించారు.
