అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం పైన పటారం..లోన లొటారం అన్నట్లుగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు అది చాలా చిన్నపని అని చెప్పుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం అర్థమయింది. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో అదే పనిగా చర్చలు జరిపినా ఎవరూ తగ్గలేదు. ఎవరి డిమాండ్లు వారు వినిపిస్తున్నారు. అయితే ట్రంప్ ఇక్కడ.. బలమైన రష్యాపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ఆసక్తిగా లేరు. ధైర్యం చేయడం లేదు. ఉక్రెయిన్ ను మాత్రం బెదిరిస్తున్నారు. రష్యా అడిగింది ఇచ్చేసి.. యుద్ధం ఆపేయాలంటున్నారు.
రష్యా కోసం మాట్లాడుతున్న ట్రంప్
యుద్ధం ఆపేస్తానని ముందుకు వచ్చిన ట్రంప్.. బలహీనమైన ఉక్రెయిన్ నే ఎక్కువగా బెదిరిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఇప్పటికి రెండు సార్లు వాదనలకు దిగారు. రష్యా చెప్పినట్లుగా వినాలని లేకపోతే సర్వనాశనం అయిపోతావని హెచ్చరించారు. సాయం చేసేది లేదని అంటున్నారు. బయటకు మాత్రం అండగా ఉంటామని చెబుతున్నారు. కానీ అలాంటి సూచనలేమీ లేవు. పైగా ఉక్రెయిన్ ను ఇబ్బంది పెట్టి.. రష్యాకు మేలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ భూభాగాన్ని డిమాండ్ చేస్తున్న రష్యా
రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడమే కాదు.. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తూ మారణహోమానికి పాల్పడుతోంది. ఇప్పుడు యుద్ధం ఆపాలంటే.. ఉక్రెయిన్ లో అత్యంత కీలకమైన ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దీనికి ట్రంప్ వత్తాసు పలుకుతున్నారు. రష్యా దౌర్జన్యం ఆగాలంటే… వారు అడిగింది ఇచ్చేయమని ఉక్రెయిన్ పై ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే మొత్తం నాశనం అయిపోతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ఎంతో కోల్పోయింది. ఇంకా భూభాగాన్ని కూడా కోల్పోవాలా అని వారు మథనపడుతున్నారు. అండగా ఉండాల్సిన వారే ఇలా రష్యాకు పరోక్షంగా మద్దతిస్తూ..తమపై ఒత్తిడి చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.
ఉక్రెయిన్‌కు ఈ దుస్థితి అమెరికా,యూరప్ ల వల్లే !
ఉక్రెయిన్ కు ఈ దుస్థితి రావడానికి కారణం అమెరికా,యూరప్‌ల వల్లే. రష్యా ను టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ ను.. నాటోలోకి తీసుకోవాలని అనుకున్నారు. ఉక్రెయిన్ కూడా దానికి రెడీ అయింది. అయితే నాటోలో చేరకుండానే పుతిన్ యుద్ధం ప్రారంభించారు. ఉక్రెయిన్ ను నాశనం చేస్తున్నా.. అమెరికా, యూరప్‌లు పట్టించుకోలేదు. ఇంకా యుద్ధానికి సాయం చేయడంతో అది తీవ్రమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగం కూడా ఇచ్చి రష్యాతో యుద్ధం ఆపేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. అగ్రదేశాలను నమ్ముకున్న ఉక్రెయిన్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. బలహీనుల్ని కొట్టి యుద్ధం ఆపేయడం చాలా తేలికైన పని అని ట్రంప్ గప్పాలు కొట్టుకుంటున్నారు.
