అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు మిత్రదేశమని మరోసారి వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో విబేధాలు ఉండవచ్చు కానీ.. ఆత్మీయులం అని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రధాని మోదీ కూడా ట్విట్టర్లో స్పందించారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు అవసరమన్నారు. ఇదే ట్రంప్.. కొన్ని గంటల ముందు భారత్, రష్యా అమెరికాకు దూరమయ్యాయని ప్రకటించేశారు. దాంతో ఇక అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని అనుకున్నారు. కానీ కాసేపటికే మాట మార్చారు.
భారత్ లాంటి మిత్ర దేశాన్ని కోల్పోవడం అమెరికాకు దీర్ఘ కాలంలో అటు రక్షణ పరంగా.. ఇటు అగ్రరాజ్యం అనే హోదాను నిలబెట్టుకునే క్రమంలోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ట్రంప్ మాత్రం.. నిలకడన లేని ప్రకటనలు చేస్తూ గందరగోళంలోకి నెడుతున్నారు. రష్యా చములు కొనడం ఒక్కటే తమ కు కోపం తెప్పిస్తోందని ఒక్కో సారి అంటారు.. కానీ అసలు కారణం అది కాదని.. ఆయనను వ్యక్తిగతం పొగడలేదని..నోబెల్ బహుమతికి సిఫారసు చేయలేదన్న కోపం ఉందని నిపుణులు అంటున్నారు.
ట్రంప్ ఇలా ఉన్నంత కాలం అమెరికా విదేశాంగ విధానం ఇంతే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మిత్రదేశాలతోనూ ఆయన పరాచికాలు ఆడుతూ.. పన్నులు బాదుతూండటంతో ఆయా దేశాలు కూడా అమెరికాను గౌరవించడం మానేశాయి. ఇజ్రాయెల్ కూడా అమెరికాతో విబేధిస్తోంది. ట్రంప్ దిగిపోయేలోపు అమెరికా.. ఎన్ని దేశాలకు శుత్రదేశం అవుతుందో కానీ.. కనీస గౌరవం ఇచ్చే దేశాలు మాత్రం తగ్గిపోతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.