‘హరిహర వీరమల్లు’ పై బ్యాడ్ ప్రాపగాండ జరిగిన మాట వాస్తవం. ఈ సినిమా గురించి చాలామంది తక్కువగా మాట్లాడారు. ఆ ఆవేదన అంతా వీరమల్లు ట్రైలర్ లాంచ్ లో దర్శకుడి జ్యోతికృష్ణ మాటల్లో తేటతెల్లమైంది. సినిమా లేట్ అవ్వడం, దర్శకులు మారడం ఇలా రకరకాల కారణాలతో పవన్‌కల్యాణ్ సినిమాలకు రావాల్సిన హైప్ రాలేదు.
కానీ నిర్మాత ఎ.ఎం.రత్నం మాత్రం ట్రైలర్ పై నమ్మకంతో ఉన్నారు. ట్రైలర్ వస్తే అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయని, ఈ సినిమా క్రేజ్ మారుతుందని గట్టిగా చెప్పేవారు. జ్యోతి కృష్ణ కూడా ట్రైలర్ కట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. స్వయంగా త్రివిక్రమ్ ఈ ట్రైలర్ కట్ లో చేదోడు వాదోడుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని డైలాగులు రాశారని తెలిశాక మరింత ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల్ని మోసుకొంటూ ట్రైలర్ వచ్చేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాత రత్నం నమ్మకాన్ని ఈ ట్రైలర్ నిజం చేసింది. సినిమాలో ఏముంది? ఎందుకోసం ఇంత ఆలస్యమైంది? ఈ సినిమాతో ఏం చెప్పబోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం ట్రైలర్ చెప్పేసింది. పవన్ లుక్ ఒక్కో షాట్ లో ఒక్కోలా ఉంది. అంతిమంగా ఫ్యాన్స్ కి నచ్చేలా వుంది. అంతకంటే ఏం కావాలి? ముఖ్యంగా చివరి షాట్ లో పవన్ ని చూడండి. మొహమంతా రక్తం.. నుదుటన తిలకం, కళ్లల్లో ఫైర్…. ఆ ఒక్క షాట్ చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందులో పవన్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రావిణ్యం మొత్తం చూపించారు. సనాతన ధర్మం గురించి పవన్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. దాన్ని ఈ సినిమాతోనూ చెప్పబోతున్నారన్న విషయం ట్రైలర్ తో స్పష్టమైంది. నిర్మాణ విలువలు భారీగా కనిపించాయి. ఎ.ఎం.రత్నం సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా.
ఈ ట్రైలర్ తో వీరమల్లు బజ్ పెరడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా బిజినెస్ గురించి ఇప్పటి వరకూ పలురకాలుగా మాట్లాడుకొన్నారు. ఇక ఈ ట్రైలర్ తో బిజినెస్ తలుపులు కూడా తెరచుకొన్నట్టే. తప్పకుండా ఈ ట్రైలర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచడం మాత్రం ఖాయం.