విశాఖలో లూలు మాల్‌కు సీఎం చంద్రబాబునాయుడు పెట్టుబడుల సదస్సు ముగింపు రోజు శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సదస్సులోనే లూలు కంపెనీలు మరిన్ని పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ కంపెనీ విషయంలో పలు సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. అత్యంత విలువైన భూముల్ని చాలా తక్కువకే లీజుకు ఇస్తున్నారు. దాని వల్ల ఏపీకి ఎంత ప్రయోజనం కలుగుతుందన్న అంశంతో పాటు ఇదే సంస్థ అహ్మదాబాద్ లో మార్కెట్ ధరకు భూములు కొనుగోలు చేసి.. రూ. 30 కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అక్కడ మాల్ నిర్మించబోతోంది. మరి విశాఖ, విజయవాడల్లో మాత్రమే ఎందుకు బహిరంగ మార్కెట్ కు కొనుగోలు చేయడం లేదు.
సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇవ్వడం వేరు.. మాల్స్ కు ఇవ్వడం వేరు !
లూలూ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధమైన మాల్స్ నిర్వహణ సంస్థ. అందులో సందేహం లేదు. మాల్స్ మాల్సే.. అవి సాఫ్ట్ వేర్ కంపెనీలు కావు. అవి కల్పించే ఉద్యోగావకాశాలు దిగువ స్థాయివి. అంటే చిన్న శాలరీలు ఉండే ఉద్యోగాలు. భారీ జీతాలు ఉండే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతకు మించిన ఉపయోగం ఉండదు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే .. ఆ కంపెనీ వల్ల ఓ ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. కానీ మాల్స్ వల్ల ఎలాంటి ఎకో సిస్టమ్ ఏర్పడదు. విశాఖలో ఇప్పటికే ఇనార్బిట్ వంటి మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి.
సబ్సిడీలు ఇవ్వడం తప్పు కాదు..దానికి తగ్గ ప్రయోజనం ఏపీకి, యువతకు దక్కాలి!
ఒకప్పుడు లూలు కంపెనీ మాల్స్ కట్టడానికి ఏర్పాట్లు చేసింది. అంతా పూర్తయిన తర్వాత జగన్ ప్రభుత్వం రావడంతో మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. అప్పుడే లూలూ కంపెనీ తాము భవిష్యత్ లో ఏపీలో పెట్టుబడి పెట్టేదే లేదని ప్రకటించారు. కానీ ప్రభుత్వం మారాక.. చంద్రబాబు మరోసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇచ్చి.. కేంద్రంతో భరోసా ఇప్పించిన తర్వాతనే వారు ముందుకు వచ్చారు. అంత వరకూ బానే ఉంది కానీ భారీ సబ్సిడీలు కోరుకోవడమే పెద్ద సమస్యగా మారింది. ఆ కంపెనీ గొంతెమ్మ కోరికలు కోరుతోందని డిప్యూటీ సీఎం కూడా అభిప్రాయపడ్డారు. అందుకే ఈ విషయంలో లూలూ కంపెనీ కోరుతున్న సబ్సిడీలేంటి.. ఎంత ఇచ్చారు.. రూల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టి.. కన్విన్స్ చేయాల్సి ఉంది.
పెట్టుబడిదారుల విశ్వాసం ముఖ్యం.. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు కూడా !
పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని పారిశ్రామిక వేత్తల సహకారంతోనే ముందుకు తీసుకెళ్లాలి. అది తప్ప మరో ఆప్షన్ లేదు. అలా చేయాలంటే పెట్టుబడిదారుల విశ్వాసం చాలా ముఖ్యం. అందుకే వారికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేరు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడలేరు. అందుకే లూలూ విషయంలో మరింత పారదర్శకత ప్రజలు కోరుకుంటున్నారు. ఆ సంస్థకు ఇస్తున్న సబ్సిడీలకు తగ్గ ప్రయోజనం ఏపీకి వస్తుందని అందరికీ తెలిసేలా చేస్తే.. తర్వాత అనవసర ఊహాగానాలకు అవకాశం ఉండదు.
