అంబానీలపై ఐటీ, ఈడీ దాడులు జరగడం ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూశామా?. కానీ కాలం మారింది. ఇప్పుడు చూస్తున్నాం.అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బులు ఎగ్గొట్టిందని ఈడీ దాడులు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకుల నుండి రూ. 31 వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఇందులో రూ.14,000 కోట్లు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానంగా ఎస్బీఐ రుణాలు ఇచ్చింది. కన్సార్టియం బ్యాంకులన్నీ కలిపి ఆర్బీఐకి , సీబీఐకి ఫిర్యాదు చేశాయి. గురువారం రోజున ED ముంబైలోని 35 ప్రాంగణాలలో సోదాలు నిర్వహించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో కార్పొరేట్ రుణాలు 2017-18తో పోలిస్తే 2018-19లో ఐదు వేల కోట్లు పెరిగాయి. ఇది అనుమానాస్పద లావాదేవిగా ఈడీ గుర్తించింది. ED ఆరోపణల ప్రకారం, యస్ బ్యాంక్ నుండి 2017-19 మధ్య తీసుకున్న రూ. 3,000 కోట్ల రుణాలు అక్రమంగా మళ్లించారు.
RCom 2019 జూన్ 28న దివాలా ప్రకటించింది. ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద ఉంది. ED దర్యాప్తులో విదేశీ బ్యాంక్ ఖాతాలు , విదేశీ ఆస్తులపై కూడా దృష్టి సారించింది. 2020లో, అనిల్ అంబానీ బ్రిటిష్ కోర్టులో వ్యక్తిగత దివాలా ప్రకటించారు. చైనా బ్యాంకులకూ రూ. 15,000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు. తన వద్ద చిల్లిగవ్వ లేదని గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆయన వారసులు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు.