ఎడిటర్స్ కామెంట్ : రాజకీయ ప్రత్యర్థులే అవినీతి పరులా !?

” ఇలా బీజేపీలో చేరగానే మీకు ఓ ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీపై ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయి” ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ జోక్. కానీ ఇది జోక్ కాదు సీరియస్సే. బీజేపీలో చేరినా.. బీజేపీకి అనుబంధంగా మారినా చాలు.. దేశాన్ని దోచుకున్నా.. భ్రష్టుపట్టిస్తున్నా.. నాశనం చేస్తున్నా భరోసారి లభిస్తుంది. కేసులు ఉండవు సరి కదా… అప్పటికి దొరికిపోయి ఉంటే కేసులు ముందుకు కదలవు. గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న పంచాయతీ ఇదే.

అవినీతి కట్టడిపై మోదీ చెప్పిన మాటలు డైలాగులేనా ?

” చిన్న కుంభకోణాన్ని చేసినప్పుడు విస్మరిస్తే.. అది పెద్ద కుంభకోణాలు చేయడానికి దోహదం చేస్తుంది..! కొద్దిగా అవినీతికి అలవాటు పడిన వారిపై.. దొరికినా ఏమీ చర్యలు తీసుకోకపోతే.. వారు ధైర్యంగా మరింత అవినీతి చేస్తారు..” ఇది కొన్నాళ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన మాట. అవినీతి కేసుల్లో జాప్యం కుంభకోణాలకు పునాది అని గట్టిగానే చెప్పారు. అది ఎవరైనా మేధావి రాసిచ్చిన స్క్రిప్ట్ .. అలా చదివేసి వెళ్లిపోయారో లేకపోతే.. నిజంగానే ఆయన అందులో ఉన్న అంశాల గురించి ఆలోచించారో లేదో ఎవరికీ తెలియదు. దేశంలో జరుగుతోంది మాత్రం వేరే. నరేంద్రమోడీ ప్రధాని పదవిని చేపట్టి.. ఎనిమిదేళ్లవుతోంది. ఎంత మంది ఆర్థిక అవినీతి పరులపై కేసులు పెట్టారు. బీజేపీ చేరిన ఎంతో మంది పునీతులైపోయారు. కానీ అసలు లావాదేవీలే జరగని నేషనల్ హెరాల్డ్ అనే కేసులో రాహుల్ గాంధీని రోజుల తరబడి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీకే ఆ పరిస్థితి ఉంటే ఇక ఇతరుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వీలైన అన్ని కుట్రలకూ పాల్పడుతోంది. దర్యాప్తు సంస్థలతో రాజకీయాన్ని ఏకపక్షంగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతున్నాయి. అవి ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి.

ఏళ్ల నాటి నేషనల్ హెరాల్డ్ సరే కళ్ల ముందు కనిపిస్తున్న దోపిడిపై చర్యలేవి ?

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానక్కర్లేదని చెప్పిన సుప్రీంకోర్టు 2015లోనే వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. రాజకీయంగా, ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని చేస్తున్న ప్రయత్నమే తప్ప.. ఈ కేసు నిజంగా తప్పుడు పనులు చేసినందుకు పెట్టిందని ఎవరూ నమ్మరు. నిజానికి ఇందులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. తప్పేమిటో కూడా చెప్పలేకపోతున్నారు. నిజంగా ఇలాంటి కేసులపై ఈడీ విచారణ చేపట్టాలనుకుంటే కొన్ని వేల కోట్ల వ్యవహారాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అంతేందుకు ఇటీవల ఐటీ.. అనేక చోట్ల సోదాలు చేసి వందల కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. వాటిపై కేసులేమయ్యాయి ? ఎవరికీ తెలియదు. కానీ ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఎప్పటి కేసులో వెలుగులోకి తెస్తున్నారు. వారిపైనే కేంద్ర సంస్థలు దృష్టి కేంద్రీకరించడం, అధికార పార్టీ వారిని కాని, వాటి మిత్రపక్షాల జోలికి కానీ వెళ్లడం లేదు.

బీజేపీలో చేరినా.. బీజేపీకి సామంతులుగా ఉన్న వారంతా నీతిమంతులైపోతారా ?

కేసులు ఎదుర్కొని బీజేపీలో చేరిన వాళ్లు కానీ.. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న వారు కానీ..ఎప్పుడైనా విచారణకు హాజరవడం చూశారా ? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ బిజెపిలో చేరిన తర్వాత ఈడీ కానీ, సిబిఐ కానీ ఆయనను ఒక్కసారి కూడా పిలిపించలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై కేసులున్నా ఆయనకు సమన్లు లేవు. నారాయణ్ రాణే, రామన్ సింగ్, ముకుల్‌రాయ్, సువేందు అధికారిలపై కూడా కేసులున్నాయి. వారు ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు సమన్లు మీద సమన్లు వెళ్లాయి. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదు. వారి సంగతి ఎందుకు మన తెలుగు రాష్ట్రాల సంగతే చూసుకుంటే.. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి వెంట పడిన సీబీఐ… బీజేపీలో చేరిన తర్వాత ఆయనను ఒక్క సారి కూడా ఎందుకు ప్రశ్నించారు. కళ్ల ఎదుట కనిపించే ఆధారాలతో దొరికిపోయిన జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు సైతం వెళ్లడం లేదు. న్యాయవ్యవస్థనే నిర్వీర్యం చేసేంత సాహసానికి ఎలా ఒడిగట్టగలిగారు ?

అవినీతి చేసి కేసుల పాలు కాకుండా ఉండాలనుకునేవారికి షెల్టర్‌గా బీజేపీ !

దేశంలో అవినీతి అణచివేత సాధ్యమవుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించామని అప్పుడప్పుడూ మోదీ చెబుతూంటారు. కానీ వాస్తవం అలా లేదు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. ఎంతటి అవినీతి పరులైనా బీజేపీలో చేరితే అంతా నీతి అయిపోతుందని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరని అనుకుంటున్నారు. అది ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాదు… హత్యలు, అత్యాచారాలు లాంటి దారుణమైన ఘటనలకు పాల్పడే వారికి కూడా బీజేపీ ఓ షెల్టర్‌గా మారిపోయింది. వారపై ఈగ వాలడం లేదు. బీజేపీలో చేరే వారే కాదు.. వారి రాజకీయ అవసరాలు తీర్చే వారిలో అవినీతి పరులు ఉన్నా రక్షిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం బొక్కేసి.. నిర్భయంగా రాజకీయాలు చేస్తున్నవారు.. విచారణలు ఆలస్యం చేసుకుంటూ ఇంకా ఇంకా దోపిడికి పాల్పడుతున్న వారు కళ్ల ముందే ఉన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా.. వారిని రాజకీయ అవసరాల కోసం కాపాడుతూనే ఉన్నారు. కానీ బయటకు మాత్రం… అవినీతిని అంత మొందిస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఉపేక్షిస్తున్న అవినీతి పరులు వ్యవస్థల్నే కుప్పకూల్చుతున్నారని తెలియడం లేదా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనుకుంటే.. అవినీతి పరుల్ని తరిమేయాలనుకుంటే.. అడ్డుకునేవారు లేరు. బీజేపీ కి రాజకీయ అవసరాల కోసమో… తన ప్రత్యర్థుల్ని ఎదుగకుండా చేయాలన్న లక్ష్యంతోనే అవినీతి పరులకు అండగా ఉండాలని అనుకుంటే.. ఆయన చెప్పినట్లుగా అది ఇంకా ఇంకా భారీ కుంభకోణాలకు దారి తీస్తుంది. అంతిమంగా దేశానికి నష్టం కలిగిస్తుంది. ఇప్పటి వరకూ మాటలే చెప్పారు.. ఇక నుంచి చేతల్లోనూ చూపించాల్సిన అవసరం.. ప్రధానికి ఏర్పడింది. రాజకీయ అవినీతి పరుల్ని అవసరాల కోసం ఉపేక్షించడం వల్ల అవినీతి పరులు న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయవ్యవస్థపై భీకరంగా దాడి చేస్తున్నారు. విశ్వసనీయతను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా పేర్లను సైతం యథేచ్చగా ప్రచారంలోకి పెట్టేస్తున్నారు. మోడీ, అమిత్ షాలను కలిసిన తర్వాతే.. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ.. కొంత మంది లేఖ రాయడంతో.. వారి మద్దతుతోనే లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. అలా చెప్పడమే కాదు..వారికి సంబంధించిన ఓ న్యాయమూర్తి ఉన్నారని.. ఆయనను చీఫ్ జస్టిస్ చేయడానికే ఇలా చేస్తున్నారని పుకార్లు కూడా పుట్టించారు. ఇదంతా కేంద్రానికి తెలియదా..? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా ?

రాజు పక్షపాతం చూపిస్తే రాజ్యం అల్లకల్లోలమే !

రాజు ఎప్పుడూ రాజధర్మం పాటించాలి. సొంత రాజ్యంలో కొంత మందిని శత్రువులుగా.. మరికొంత మంది మిత్రులుగా చూసి.. చట్టాన్ని శత్రువులకు మాత్రమే వర్తింప చేస్తే రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. చరిత్ర చెప్పిన పాఠాలు ఇవే. చరిత్రదేముంది మార్చేస్తే మారిపోతుందనుకుకునే తెగింపు వచ్చేసిన ఈ రోజుల్లో రేపేం జరిగిదే మాకెందుకు ఈ రోజు అధికారం అనుభవించామా లేదా అన్నట్లుగా పాలకుల మైండ్ సెట్ మారిపోయింది. ఈ రోజు ఏం చేసినా .. ఈ రోజుకు బాగానే ఉంటుంది. కానీ దాని ఫలితం తర్వాత అనుభవిస్తారు. తర్వాత తరాలు అనుభవిస్తాయి. దేశం అనుభవిస్తుంది. వ్యవస్థలన్నీ బలంగా ఉన్న దేశాల్లో మాత్రమే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. రాజకీయాలు.. అధికారుల మధ్య వ్యవస్థలు చిక్కుకుపోయిన దేశాలు అల్లకల్లోలంగా మారాయి. ఇలాంటి పరిస్థితులు మనం.. మనం ఎదుర్కోక ముందే మేల్కొనాల్సి ఉంది. పక్షపాతం చూపించకుండా చట్టాలన్నీ అందరికీ వర్తింప చేయాలి. మన పార్టీ వాడు.. మన వాడు అని కాకుండా… తప్పు చేసిన ప్రతి ఒక్కర్ని శిక్షించాలి. ఆలస్యం కాకుండా న్యాయం అందించాలి. లేకపోతే.. మొదట చెప్పుకున్నట్లుగా దేశం కొంత మందిదే అవుతుంది. అప్పుడు మిగిలిన వారిలో అలజడి ప్రారంభమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా వెల్లువెత్తుతున్న నిరసనలే కనిపిస్తున్నాయి. రైలు బోగిలు దహనమవుతున్నాయి… ఆస్తులు ధ్వంసమవుతున్నాయి.. బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి.. రెండు వైపులా విధ్వంసం జరుగుతోంది. చివరికి ఈ పరిస్థితి ఎక్కడికి చేరుతుందో అంచనా వేయడం కష్టం. పరిస్థితిని.. ప్రమాదాన్ని పాలకులు ఇప్పుడైనా గుర్తించాలి. వ్యవస్థల్ని బలోపేతం.. చేసి వాటి విధినిర్వహణను అవి స్వతంత్రంగా చేసుకునేలా చూడాలి. దేశానికి అంతకు మించి చేసే గొప్ప సేవ ఏమీ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close