రివ్యూ: ఈ న‌గ‌రానికి ఏమైంది?

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

‘ఈ సినిమాకి ఏమైంది?’
– అని మ‌న‌కు చాలాసార్లు అనిపించి ఉంటుంది.

హీరో, ఆయ‌న‌గారి బిల్డ‌ప్పులు, విల‌న్ అరుపులు, హీరోయిన్ వెర్రి చేష్ట‌లు, క‌మిడియ‌న్ పిచ్చి చూపులు, వంద‌ల సినిమాలు తుత్తు చేసిన పిచ్చి క‌థ‌, చివ‌ర్లో మ‌నం ఊహించే ట్విస్టు.. ఓహ్‌… అవన్నీ చూసి, విసుగొచ్చి.. ‘ఈ సినిమాలు మార‌వా’ అంటూ… మ‌న‌మే జుత్తు పీక్కోవాల్సిన ప‌రిస్థితి.

అయితే – సినిమాకేం కాదు… దాని భ‌విష్య‌త్తు బ్ర‌హ్మాండంగా ఉంటుంది అని కొత్త‌త‌రం ద‌ర్శ‌కులు వ‌చ్చిన‌ప్పుడు ధీమా క‌లుగుతుంది. ఓ పెళ్లి చూపులు.. ఓ అర్జున్ రెడ్డిలాంటి సినిమాలు చూస్తున్న‌ప్పుడు కొండంత ధైర్యం వ‌స్తుంది. సినిమా తీత మారిందన్న తృప్తి క‌లుగుతుంది. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ చూసినా అదే ఫీలింగ్!

సాధార‌ణంగా ఓ సినిమాకి బ‌ల‌మైన క‌థ‌, పాత్ర‌లు, వాటి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, డ్రామా.. ఇవ‌న్నీ ఉండాల‌నుకుంటాం. అయితే న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కొంత‌మంది ఇవేం న‌మ్మ‌డం లేదు. కథ‌, క‌థ‌నం, సంఘ‌ర్ష‌ణ‌.. వీటి స్థానంలో సహజ‌త్వం కుమ్మ‌రిస్తున్నారు. ఓ విధంగా వాళ్ల బ‌లం అదే. మ‌న జీవితంలో ‘క‌థ‌’ ‘క‌థ‌’ గా ఉండ‌దు. దానికో స్టైల్ ఉండ‌దు. ఓ ప్రారంభం, ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌.. క్లైమాక్స్ ఇవేం ఓ ఆర్డ‌రు ప్ర‌కారం క‌నిపించ‌వు. మ‌రి సినిమాల్లో మాత్రం ఎందుకు ఉండాలి? డ్రామా అనేది సినిమాల్లో ఎందుకు? అనేది వాళ్ల ఆలోచ‌న‌. అదే.. కొత్త త‌ర‌హా సినిమాల్ని చూపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బాలీవుడ్‌, హాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన‌.. ఈ మేకింగ్ టాలీవుడ్ కి వ‌చ్చేసింది. పెళ్లి చూపులు సినిమాలో కొంత వ‌ర‌కూ ఈ స్కూల్ చూపించిన త‌రుణ్ భాస్క‌ర్‌… ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’తో పూర్తిగా గేట్టు ఎత్తేశాడు.

క‌థ‌

వివేక్‌, కార్తిక్‌, కౌశిక్‌, ఉపేంద్ర‌.. న‌లుగురూ స్నేహితులు. వివేక్ కి డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఉంటుంది. అందుకోసం షార్ట్ ఫిల్మ్స్ తీద్దామ‌నుకుంటాడు. అయితే త‌న‌కు షార్ట్ టెంప‌ర్ కాస్త ఎక్కువ‌. ఆ కోపంతోనే.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ఆ ఫ్ర‌స్టేష‌న్‌తో జీవితాన్ని గ‌డుపుతుంటాడు. ఓ కార‌ణంతో విడిపోయిన ఈ గ్యాంగ్‌… కార్తిక్ పెళ్లి కుద‌ర‌డంతో మ‌ళ్లీ క‌లుస్తుంది. ముగ్గురు స్నేహితుల‌కు ఓ ప‌బ్‌లో పార్టీ ఇస్తాడు కౌశిక్‌. అయితే ఆ పార్టీలో, తాగిన మ‌త్తులో… అట్నుంచి అటు గోవాకి వెళ్లిపోతారు. గోవాలో ఈ గ్యాంగ్ చేసిన అల్ల‌రేంటి? ఆ క్షణాల్ని వాళ్లు ఎలా గ‌డిపారు? జీవితంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు ఎలా తీసుకున్నారు? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

త‌రుణ్ భాస్క‌ర్ కాకుండా, వేరెవ‌రైనా ఇదే క‌థ‌ని, సురేష్ బాబుకి, ఇలానే చెబితే.. మొహ‌మాటం లేకుండా ఎగ్జిట్ గేటు వైపు చూపించేద్దుడు. కానీ… త‌రుణ్ భాస్క‌ర్ స్టామినా తెలిసిన నిర్మాత కాబ‌ట్టి – ‘గో ఎహెడ్‌’ అనేశాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాలో త‌రుణ్ బ‌ల‌మైన క‌థేం చూపించ‌లేదు. స‌న్నివేశాల్ని లైవ్లీగా, లైవ్‌లో చూస్తున్న‌ట్టు రాసుకున్నాడు. సేమ్ టూ సేమ్ అదే ట్రిక్ ఇక్క‌డా ప్లే చేశాడు. ‘ఇదిగో ఇక్క‌డ నేనో క‌థ చెబుతున్నా.. జాగ్ర‌త్త‌గా వినండి.. అన‌గ‌న‌గ‌న‌గా…’ అంటూ ఈ స్టోరీ మొద‌లెట్ట‌లేదు. ‘ఇక్క‌డ జోక్ వినిపిస్తున్నా.. న‌వ్వుకోండి’ అంటూ పంచ్‌లు వేయ‌లేదు. న‌లుగురు స్నేహితుల మ‌ధ్య కెమెరా పెట్టి, వాళ్ల న‌వ్వుల్ని, మాట‌ల్ని, స‌ర‌దాల్ని, కేరింత‌ల్ని, కోపాల్నీ క్యాప్చ‌ర్ చేసి ప్రేక్ష‌కుడ్ని అయిదో స్నేహితుడిగా మార్చేశాడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ న‌లుగురితో క‌ల‌సి మందుకొట్టాల‌ని, వీలైతే క‌ల‌సి గోవా వెళ్లాల‌ని, వాళ్ల షార్ట్ ఫిల్మ్‌లో ఓ భాగం కావాల‌ని అనిపించేంత‌గా క‌థ‌లోకి లాక్కెళ్లిపోయాడు. స‌న్నివేశాల్లో ఫ్రెష్ నెస్ క‌నిపించింది. వాళ్ల మ‌ధ్య మాట‌లు అత్యంత స‌హ‌జంగా అనిపించాయి. కెమెరా యాంగిల్ ఇలానే పెట్టాలి, ఈ సన్నివేశాన్ని ఇలానే ప్రారంభించాలి, ఇలానే ముగించాలి అనే రూల్సేం పాటించ‌లేదు. దాంతో.. ఈ సినిమాని చూసే కోణం కూడా మారిపోయింది. ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్ చూస్తే.. త‌రుణ్ భాస్క‌ర్ స‌హ‌జ‌త్వాన్ని ఎంతగా ఇంజ‌క్ట్ చేయాల‌ని చూశాడో అర్థం అవుతుంది.

”నీకు టీ పెట్ట‌డం వ‌చ్చా, అన్నం వండ‌డం వ‌చ్చా” అని అడుగుతాడు హీరో
”ఇవ‌న్నీ ఎందుకు అడుగుతున్నావ్‌” అంటుంది హీరోయిన్‌
”మా ఇంటికొస్తే వండి పెట్టాలిగా…” – ఇదీ హీరో జ‌వాబు. హీరో ఏం చెప్పాల‌నుకున్నాడో హీరోయిన్‌కేకాదు, ప్రేక్ష‌కుల‌కూ తెలిసిపోతుంది.
”వ‌చ్చులే.. నువ్వేం కంగారు ప‌డ‌కు” అని చెబుతుంది హీరోయిన్‌. అంటే… ల‌వ్‌ని ఒప్పుకుంద‌న్న‌మాట‌. ఇలా అత్యంత స‌హ‌జంగా ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన స‌న్నివేశం ఇంకోటి ఉంటుందా?

హీరో – హీరోయిన్లు విడిపోతే – ‘ఆ… చివ‌ర్లో క‌లుసుకుంటార్లే’ అనిపిస్తుంది ప్రేక్ష‌కుల‌కు. హీరో కోసం ఎదురు చూసి, ఎదురు చూసీ, ఇంట్లో వాళ్లు తెచ్చిన సంబంధాన్నీ, కోట్ల ఆస్తుల్ని వ‌దిలేసి హీరో కోసం వ‌చ్చేస్తుంది హీరోయిన్‌. ఇదంతా సినిమాల్లో. నిజ జీవితంలో అలా జ‌ర‌గ‌దు. ప‌రిస్థితుల‌కు స‌ర్దుకుపోతారంతా. స‌రిగ్గా ఈ సినిమాలోనూ అంతే. హీరో, హీరోయిన్లు విడిపోయాక‌,ఏ గోవాలోనో క‌లిసిపోతారులే అనుకుంటారు. కానీ అస‌లు విడిపోయిన ఆ అమ్మాయి ప్ర‌స్తావ‌న రాకుండా, క‌థ‌ని వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా న‌డిపాడు.

అయితే… క‌థానాయ‌కుడి పాత్ర చిత్ర‌ణ‌లో `అర్జున్ రెడ్డి` ఛాయ‌లు క‌నిపిస్తాయి. యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ లేక‌పోవ‌డం, తాగుబోతు, ల‌వ్ ఫెయిల్యూర్‌… ఇవ‌న్నీ వివేక్ పాత్ర‌లోనూ ఉంటాయి. నాలుగు పాత్ర‌లు ఉండ‌డంతో.. ఏ పాత్ర‌ని ఓన్ చేసుకొని, క‌థిని ఫాలో అవ్వాలో ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థం నెమ్మ‌దిస్తుంది. ‘లైఫ్‌లో జ‌రుగుతున్న ఇన్సిడెన్స్‌ల‌పై కంట్రోల్ లేకుండా వెళ్లిపోతున్నా’ అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. సినిమాలోనూ జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు, స‌న్నివేశాల‌పై ద‌ర్శ‌కుడి కంట్రోల్ త‌ప్పిందా అనిపిస్తుంది. కానీ అది కాసేపే. సెకండాఫ్‌లో వివేక్‌, కౌశిక్ మ‌ధ్య తాగుడు స‌న్నివేశం, కెమెరా లెన్స్‌ని దొంగిలించుకొచ్చే సీన్‌… ఇవ‌న్నీ సినిమాలో ఫ‌న్‌ని తీసుకొచ్చి.. ఆ లోటు పూడ్చే ప్ర‌య‌త్నం చేస్తాయి. సినిమా అయిపోతోంది అనుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ ఛైల్డ్ వుడ్ ఎపిసోడ్‌లోకి తీసుకెళ్లి.. ‘ఇప్పుడు ఇది అవ‌స‌ర‌మా’ అనిపించేలా చేస్తుంది. అయితే… క్లైమాక్స్‌ని ఓ పాజిటీవ్ మూడ్‌లోకి తీసుకొచ్చి ముగించ‌డం.. ద‌ర్శ‌కుడు అక్క‌డ కూడా స‌హ‌జ ల‌క్ష‌ణాల్ని వ‌ద‌ల‌క‌పోవ‌డం న‌చ్చుతుంది.

న‌టీన‌టులు

సినిమా మొద‌ల‌య్యేట‌ప్ప‌టికి ఇందులో న‌టిస్తున్న వాళ్లెవ్వ‌రి గురించి ప్రేక్ష‌కుల‌కు ఓ ఐడియా అంటూ ఉండ‌దు. సినిమా ముగిసేలోపు వాళ్ల‌తో స్నేహం చేయ‌డం మొద‌లెడ‌తాం. అంత‌కంటే ఏం కావాలి? వాళ్లంతా బాగా చేశారు అని చెప్ప‌డానికి. మా ముందు కెమెరా ఉంది అన్న‌ది మ‌ర్చిపోయి… న‌టించ‌డం మానేసి, ప్ర‌వ‌ర్తించ‌డం మొదలెట్టారు. వివేక్ చూడ్డానికి బాగున్నాడు. న‌ట‌న స‌హ‌జంగా ఉంది. కౌశిక్ పాత్ర‌లో న‌టించిన న‌టుడు ఇంకొన్నాళ్లు తెలుగు తెర‌పై క‌నిపిస్తాడు. ఈ సినిమాతో.. మ‌రికొంత‌మంది మంచి న‌టుల్ని తెలుగు తెర‌కు ఇచ్చాడు త‌రుణ్ భాస్క‌ర్‌.

సాంకేతిక వ‌ర్గం

వివేక్ సాగ‌ర్‌… క‌థ‌ని అర్థం చేసుకుని ఆ మూడ్‌కి త‌గిన సంగీతం అందించాడు. టైటిల్ కార్డు, ఇంట్ర‌వెల్ కార్డు. ఎండ్ కార్డు ప‌డేట‌ప్పుడు వ‌చ్చిన కిక్ అంతా ఇంతా కాదు. అదంతా వివేక్ మ‌హ‌త్తు. ఫొటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ వ‌ర్క్ అన్నీ బాగున్నాయి. ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా మ‌రోసారి మెప్పించాడు త‌రుణ్. త‌న బ‌లం అంతా పేప‌ర్ పైనే ఉంది. డైలాగులు బాగా రాసుకున్నాడు. దాన్ని అందంగా తెర‌పై చూపించాడు. తాను ఇలానే… ఫార్ములాకు దూరంగా, త‌న‌కు న‌చ్చిన సినిమాల్ని తీసుకుంటూ పోతే.. మ‌రిన్ని మంచి సినిమాల్ని, కొత్త అనుభూతుల్ని అందించ‌గ‌ల‌డు.

తీర్పు:

జింద‌గీ నా మిలేగీ దుబారా, దిల్ చాహ‌తాహై.. సినిమాల్ని చూసి, అక్క‌డితో ఊరుకోక‌.. ఇలాంటి క‌థ‌ల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కూ అందించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డాడు త‌రుణ్ భాస్క‌ర్‌. కాలేజీ కుర్ర‌కారుకి, మ‌రీ ముఖ్యంగా ఎప్నుడూ ఓ గ్యాంగ్ మైంటేన్ చేసే స్నేహితుల‌కు… ఈ సినిమా త్వ‌ర‌గా క‌నెక్ట్ అయిపోతుంది. పెళ్లి చూపులు సినిమాలా.. ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూడొచ్చు. కానీ కుర్ర‌వాళ్లే బాగా ఎంజాయ్ చేస్తారు.

ఫైన‌ల్ ట‌చ్‌: ఫార్ములాకి పాడింది చ‌ర‌మ‌గీతం

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close