కౌంట్‌డౌన్ 7 : అంపైరే ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా మారిన ఎన్నికలు…!

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరో వారం రోజుల్లో జరగనుంది. అత్యంత సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో.. ప్రతీ దశలోనూ.. హాట్ టాపిక్ అయింది .. ఎన్నికల సంఘం తీరే. భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘంలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు రోజూ ఎదుర్కొంటూనే ఉంది. ఎన్నికల కోడ్‌ను.. ఒక్క విపక్ష పార్టీలకు మాత్రమే.. అమలు చేస్తూ.. బీజేపీ నేతల్ని ఎప్పటికప్పడు సుద్దపూసలుగా ప్రకటిస్తూ.. ఎన్నికల నిర్వహణ కొనసాగిస్తోంది. ఈసీ తీరు తాజా ఉదాహరణ .. ఏపీలోని అ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.

ఈసీ అంపైరింగ్ అత్యంత అనుమానాస్పదమైన ఎన్నికలు..!

అంపైర్ .. నిజాయితీగా ఉంటేనే…ఆట రసవత్తరంగా ఉంటుంది. ఇద్దరూ ఎవరి బలాలకు తగ్గట్లుగా వారు తలపడతారు. ఎవరి స్థాయి ఏమిటో తెలిపోతుంది. కానీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అంపైర్.. తనకు అధికారం ఉంది కదా.. అని ఆశ్రిత పక్షపాతం ప్రదర్శిస్తే.. మొదటికే మోసం వస్తుంది. ఆట విశ్వసనీయతను కోల్పోతుంది. ఇప్పుడు ఈసీ పరిస్థితి అదే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పక్షపాతం లేకుండా.. ఎన్నికలు నిర్వహిస్తామని.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన… రాజ్యాంగ సంస్థ తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. బీజేపీకి ఏ నిబంధనలూ అమలు కావట్లేదు. విపక్ష పార్టీలకు మాత్రం… గీత దాటితే కొరడా దెబ్బలు పడ్డాయి. బెంగాల్‌లో బీజేపీ ఉద్దేశపూర్వకంగా హింస చెలరేగేలా చేసిందనేది… మీడియా దృశ్యాలకు సైతం దొరికిన సాక్ష్యం. కానీ ఈసీ… బీజేపీని ఏమీ అనకుండా.. ప్రచారం మొత్తం ఆపేయాలని ఆదేశాలిచ్చింది.

అంపైర్ కూడా బీజేపీ కోసమే ఆడినట్లు ఉంది కదా..!

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం… ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగాలంటే… అధికారంలో ఉన్న వాళ్లకు కొన్ని పరమితులు పెట్టేందుకు చేసిన ఏర్పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంపైర్ పాత్రలో ఉండే ఎన్నికల సంఘం.. దీని ఆధారంగా అందర్నీ సమానంగా చూడాలి. ఈ కోడ్ అందరికీ ఒక్కటే. కానీ అమలు చేసే అంపైరింగ్ వ్యవస్థ దగ్గరే అసలు సమస్య వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన దగ్గర్నుంచి… ఇప్పటి వరకూ.. ఈసీ తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. అంపైర్.. కూడా బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నాడని… ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టమయిపోతుంది. ఈ విషయం సుప్రీంకోర్టులోనే బయటపడింది. కానీ ఈసీ బీజేపీపై తీసుకున్న చర్యలు అంతంమాత్రమే.

ఈసీ ఎలా పని చేయకూడదో నేర్పే ఎన్నికలు…!

దేశంలో ఎన్నికలు… ఏ దశలోనూ సక్రమంగా జరగలేదు. బెంగాల్‌లో 42 సీట్లకు ఏడు విడతలుగా ఎన్నికలు పెట్టినా… హింసను తగ్గించలేకపోయారు. దక్షిణాదిలో.. మొదటి విడతల్లోనే ఎన్నికలు పెట్టేసినా.. ఈవీఎం యంత్రాలను… నమ్మకం కలిగించేలా ఉపయోగించలేకపోయారు. అంతే కాదు.. వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ… 21 విపక్ష పార్టీలు పోరాడినా.. ఏ మాత్రం.. పట్టించుకోకుండా.. బీజేపీ వాదనను వినిపించారు. ఈసీ వాదనను బీజేపీ.. బీజేపీ వాదనను ఈసీ సమర్థించుకుంటూ పనులు చేసుకున్నాయి. ఏ విధంగా చూసినా.. గత ఐదేళ్ల కాలంలో… కూలిపోయిన వ్యవస్థల జాబితాలో ఈసీ కూడా చేరిపోయిందనే మాట.. సగటు భారతీయుడుకి ఈ ఎన్నికలు కల్పించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com