పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకుంది. గత కొద్ది నెలలుగా నగర పరిసరాల్లోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన వాణిజ్య , నివాస ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుకు పెట్టుబడిదారులు క్యూ కడుతుండటంతో, మార్కెట్ విలువకు మించి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపార సంస్థలు , విద్యాసంస్థలకు చేరువలో ఉండటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
నగర నడిబొడ్డున ఉన్న RR పేట ,యు దాని పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్లాట్లకు గజం ధర సుమారు 75,000 నుంచి 1,00,000 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల వాణిజ్య అవసరాల కోసం గజం లక్ష రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానిక రియల్టర్లు చెబుతున్నారు. కేవలం ప్రధాన నగరంలోనే కాకుండా, శాంతి నగర్, శ్రీరామ్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా గజం ధర రూ.40,000 మార్కును అధిగమించింది.
శివారు ప్రాంతాలైన సత్రంపాడు, వట్లూరు, ఏమీన్ పేట వైపు కూడా నగరం వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టుల కారణంగా ఈ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ , రహదారుల విస్తరణ వంటి ప్రభుత్వ నిర్ణయాలు ఏలూరు రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
